TG High Court: 50 శాతం పరిమితి దాటొద్దు.. ఎన్నికలు జరపండి: హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana HC allows local elections with 50 percent reservation limit
  • ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీఓను నిలిపివేసిన హైకోర్టు
  • మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని స్పష్టీక‌ర‌ణ‌
  • పాత విధానం ప్రకారమే ఎన్నికలు జరుపుకోవచ్చని వెల్లడి
  • దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీగా ప్రకటించాలని సూచన
  • ఎన్నికల ప్రక్రియను ఆపలేదని తేల్చి చెప్పిన ధర్మాసనం
గడువు ముగిసినా జరగకుండా నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు మార్గం సుగమం చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 9ను నిలిపివేసిన ధర్మాసనం, పాత విధానం ప్రకారమే ఎన్నికలతో ముందుకు వెళ్లవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టత నిచ్చింది. మొత్తం రిజర్వేషన్లు ఏ పరిస్థితుల్లోనూ 50 శాతం పరిమితిని దాటకూడదని తేల్చిచెప్పింది.

ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో 9తో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన జీఓలు 41, 42లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ జీఓల కారణంగా రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరుకుంటాయని, ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితికి విరుద్ధమని పేర్కొంటూ వాటిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి ఉత్తర్వులు శుక్రవారం రాత్రి అందుబాటులోకి వచ్చాయి.

సుప్రీంకోర్టు గతంలో రాహుల్ రమేశ్ వాగ్ కేసులో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది. ట్రిపుల్ టెస్ట్ నిర్వహించే పరిస్థితులు లేనప్పుడు, దామాషా ప్రకారం కేటాయించాల్సిన సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించవచ్చని ఆ తీర్పులో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించి ఎన్నికలు జరపవచ్చని సూచించింది.

అంతకుముందు ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ, ట్రిపుల్ టెస్ట్‌కు అనుగుణంగానే కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు కల్పించామని తెలిపింది. 50 శాతం పరిమితి అనేది కఠినమైన నియమం కాదని, ప్రత్యేక పరిస్థితుల్లో సవరించుకోవచ్చని వాదించింది. అయితే, ఈ వాదనలతో ప్రాథమికంగా ఏకీభవించని ధర్మాసనం, వికాస్ కిషన్‌రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని అభిప్రాయపడింది.

అదే సమయంలో రాజ్యాంగంలోని అధికరణ 243ఓ ప్రకారం ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోవడం లేదని, సెప్టెంబర్ 29న జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేయలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం వివాదాస్పదంగా మారిన రిజర్వేషన్ల జీఓలను మాత్రమే నిలిపివేస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
TG High Court
Telangana local body elections
BC reservations
election commission
50 percent rule
Supreme Court
Rahul Ramesh Wag case
G.O. 9
G.O. 41
G.O. 42

More Telugu News