Andhra Pradesh: పంచాయతీరాజ్‌లో కీలక సంస్కరణలు.. గ్రామాల్లోనూ మున్సిపాలిటీల తరహా పాలన

Andhra Pradesh Panchayat Raj Department Undergoes Major Reforms
  • రాష్ట్రంలో క్లస్టర్ వ్యవస్థకు ముగింపు పలికిన ప్రభుత్వం
  • 13,351 గ్రామ పంచాయతీలు ఇకపై స్వతంత్రంగానే కొనసాగింపు
  • పంచాయతీ కార్యదర్శుల హోదాను 'పీడీఓ'గా మారుస్తూ నిర్ణయం
  • పంచాయతీలను ఆదాయం, జనాభా ప్రాతిపదికన నాలుగు గ్రేడ్‌లుగా విభజన
  • గ్రామాల్లో మున్సిపాలిటీల తరహాలో ప్రత్యేక పాలనా విభాగాలు
ఏపీలో గ్రామ పంచాయతీల పాలన స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న క్లస్టర్ విధానానికి స్వస్తి పలుకుతూ, 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి శుక్రవారం ఆమోదముద్ర వేసింది. పంచాయతీరాజ్‌ శాఖలో చేపట్టిన రెండో విడత సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు 7,244 క్లస్టర్ల పరిధిలో ఉన్న పంచాయతీలు ఇకపై తమంతట తామే స్వతంత్రంగా పనిచేయనున్నాయి.

ఉద్యోగులకు కొత్త హోదా.. పదోన్నతులు
ఈ సంస్కరణల్లో భాగంగా పంచాయతీ కార్యదర్శుల హోదాను "పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ)"గా మార్చారు. రాష్ట్రంలోని పంచాయతీలను వాటి జనాభా, ఆదాయ వనరుల ఆధారంగా రూర్బన్‌, గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, గ్రేడ్‌-3 నాలుగు కేటగిరీలుగా విభజించారు. అధిక జనాభా, ఆదాయం ఉన్న 359 పంచాయతీలను ‘రూర్బన్‌’ పంచాయతీలుగా గుర్తించి, అక్కడ డిప్యూటీ ఎంపీడీఓ క్యాడర్‌ అధికారులను నియమించనున్నారు. గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి కల్పించి ఈ పంచాయతీలకు పీడీఓలుగా బాధ్యతలు అప్పగిస్తారు. అదేవిధంగా ఈ 359 రూర్బన్‌ పంచాయతీల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లలో సీనియారిటీ ప్రకారం 359 మందికి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించనున్నారు.

మున్సిపాలిటీల తరహాలో పాలన
గ్రామాల్లో పాలనను మరింత మెరుగుపరిచి, ప్రజలకు సేవలను విస్తృతం చేసేందుకు మున్సిపాలిటీల తరహాలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, ఇంజనీరింగ్, రెవెన్యూ, గ్రామీణ ప్రణాళిక వంటి విభాగాలను ఏర్పాటు చేస్తారు. ఈ విభాగాల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కాంట్రాక్టు లేదా ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించుకునే వెసులుబాటును పంచాయతీలకే కల్పించారు. వారికి గ్రామ పంచాయతీ సాధారణ నిధుల నుంచే జీతాలు చెల్లిస్తారు.

ఇప్పటికే గ్రామాల్లో ఉన్న ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్ల సేవలను గ్రామీణ ప్లానింగ్ అసిస్టెంట్లుగా వినియోగించుకుని, వారి పర్యవేక్షణలో భవన నిర్మాణ నిబంధనలు, లేఅవుట్‌ రూల్స్‌ అమలు చేయనున్నారు. రికార్డుల డిజిటలైజేషన్‌ కోసం ప్రత్యేక ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసి, సేవలు అందించేలా వ్యవస్థను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సంస్కరణల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అధికారులకు సూచించినట్లు సమాచారం.
Andhra Pradesh
Chandrababu
Grama Panchayats
Panchayat Raj reforms
AP government
Pawan Kalyan
Rural development
Village administration
PDO
Municipal administration

More Telugu News