Etela Rajender: ఇప్పటికైనా కాంగ్రెస్ తప్పు తెలుసుకోవాలి... వెంటనే ఎన్నికలు జరిపించాలి: ఈటల రాజేందర్

Etela Rajender Appeals to BCs on Reservations in Telangana
  • బీసీ రిజర్వేషన్ల కోసం ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తామన్న ఈటల
  • తమిళనాడులో రిజర్వేషన్లను అధ్యయనం చేసి రావాలని చెప్పానన్న ఈటల
  • ప్రజలను గోల్‌మాల్ చేయకుండా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఈటల
తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు రిజర్వేషన్లు రావడం బీజేపీ ఆకాంక్ష అని, పార్టీ ఎల్లప్పుడూ బీసీల వెంటే ఉంటుందని ఆ పార్టీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఎక్కడకి రమ్మన్నా సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. తమిళనాడులో ఈ రిజర్వేషన్లు విజయవంతమయ్యాయని, అక్కడ అధ్యయనం చేయాలని గతంలో తాను చాలాసార్లు సూచించానని గుర్తు చేశారు.

దేశంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కలిగినవి షెడ్యూల్డ్ ట్రైబల్, షెడ్యూల్ క్యాస్ట్ అని, వారి జనాభా ఎంత ఉంటే అంత శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో 90 శాతం మంది ఉంటే 90 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పి వెంటనే ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు.

మహాత్మా గాంధీ చెప్పినట్లు గ్రామ స్వరాజ్యం జరగాలంటే గ్రామ సచివాలయాలు, మండల కార్యాలయాలు, జిల్లా పరిషత్తులు సమర్థంగా నడవాలని అన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణలు రాజీవ్ గాంధీ తీసుకువచ్చారని గుర్తు చేశారు. 42 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎన్నికలు జరుపుతామని కాంగ్రెస్ చెప్పిందని, ఇప్పుడు ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.

కోర్టులు రిజర్వేషన్లను కొట్టి వేశాయి

మహారాష్ట్రలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా పదవులు పోయాయని గుర్తు చేశారు. బీహార్‌లో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నప్పటికీ రిజర్వేషన్లను కోర్టులు కొట్టివేస్తే ఏమీ చేయలేకపోయామని అన్నారు. దేశంలో ఇంత చరిత్ర కళ్ళ ముందు కనిపిస్తున్నా కాంగ్రెస్ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయటం మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం మోసం చేయకుండా, 42 శాతం రిజర్వేషన్‌తో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

గతంలో పనిచేసిన వార్డు మెంబర్లు, సర్పంచులకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారని, వీరికి మాత్రం ఇవ్వడం లేదని విమర్శించారు. గత దసరాకు ఇస్తామని చెప్పిన బిల్లులు ఈ దసరాకు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. పనులు చేసిన వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలోపే పాత బిల్లులన్నింటినీ చెల్లించాలని డిమాండ్ చేశారు.

రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్ ఛార్జీలు రావడం లేదని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలుగా వేతనాలు రావడం లేదని అన్నారు. విద్యార్థులకు భోజనం పెట్టలేని పరిస్థితుల్లో సరఫరాదారులు కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు కనీసం అన్నం పెట్టాలనే ఆలోచన కూడా లేదా అని మండిపడ్డారు.

అంగన్వాడీలు, ఆశా వర్కర్లు వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గెస్ట్ లెక్చరర్లు సైతం వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలన సరిగా లేదనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ గెలుపు రేవంత్ రెడ్డిదో, కాంగ్రెస్ పార్టీదో కాదని, అన్ని వర్గాలు కేసీఆర్‌ను కాదనుకుని ఓటు వేయడం వల్ల గెలిచారని అన్నారు.

ఇది ప్రజాస్వామ్యమనే విషయం మర్చిపోవద్దు

ఆరోగ్యం, విద్యతో పాటు వివిధ శాఖల్లో ఉన్న చిన్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అదే రోజు చెక్కులు అందజేస్తామని చెప్పిన హామీ నెరవేరలేదని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నారని, కానీ మీరు అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అని ప్రశ్నించారు. అప్పుల గురించి గతంలో ఎన్నోసార్లు అసెంబ్లీలో మాట్లాడారని గుర్తు చేశారు. అన్నీ తెలిసి కూడా హామీలు ఎందుకు ఇచ్చారని నిలదీశారు. ఎండాకాలంలో కొనుగోలు చేసిన సన్న వడ్లకు ఇప్పటి వరకు రూ. 500 బోనస్ రాలేదని, రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో జరగలేదని విమర్శించారు.
Etela Rajender
BC Reservations
Telangana
Congress Party
Revanth Reddy
KCR
BC Welfare
Telangana Politics

More Telugu News