Yashasvi Jaiswal: విండీస్‌పై జైస్వాల్ తడాఖా.. తొలి రోజే భారత్ భారీ స్కోరు

Yashasvi Jaiswal Dominates Windies India Scores Big on Day 1
  • వెస్టిండీస్‌తో రెండో టెస్టు: తొలి రోజు భారత్ 318/2
  • అజేయ శతకంతో చెలరేగిన యశస్వి జైస్వాల్ (173 బ్యాటింగ్)
  • 87 పరుగులతో రాణించిన సాయి సుదర్శన్
  • రెండో వికెట్‌కు 193 పరుగుల భారీ భాగస్వామ్యం
  • క్రీజులో జైస్వాల్, గిల్‌.. పటిష్ట స్థితిలో టీమిండియా
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో, తొలి రోజు ఆట ముగిసే సమయానికి అజేయ శతకంతో (173 బ్యాటింగ్) కదం తొక్కాడు. ఫలితంగా, టీమిండియా తొలి రోజు కేవలం రెండు వికెట్లు కోల్పోయి 318 పరుగుల భారీ స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కలిసి తొలి వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి శుభారంభం అందించారు. ఆ తర్వాత రాహుల్ (38) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్‌తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిర్మించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 193 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో సుదర్శన్ (87) తన తొలి టెస్టు శతకానికి చేరువలో వికెట్ చేజార్చుకున్నాడు. జొమెల్ వారికన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోవడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు.

మరోవైపు, ఆరంభంలో ఆచితూచి ఆడిన యశస్వి జైస్వాల్, క్రీజులో కుదురుకున్న తర్వాత తన దూకుడు పెంచాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. తన టెస్టు కెరీర్‌లో ఐదోసారి 150 పరుగుల మార్కును దాటిన జైస్వాల్, డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.

సుదర్శన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (20*)తో కలిసి జైస్వాల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్ బౌలర్లలో జొమెల్ వారికన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
Yashasvi Jaiswal
India vs West Indies
Yashasvi Jaiswal century
India cricket
Sai Sudharsan
Arun Jaitley Stadium
Jomel Warrican
Shubman Gill
India batting
West Indies tour of India

More Telugu News