Air India: వియన్నా-ఢిల్లీ ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు

Vienna to Delhi Air India Flight Makes Emergency Landing in Dubai
  • గాల్లో ఉండగా విమానంలో సాంకేతిక సమస్య
  • విమానాన్ని హఠాత్తుగా దుబాయ్‌కు మళ్లించిన పైలట్లు
  • ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారన్న ఎయిరిండియా
  • దుబాయ్‌లో తనిఖీల తర్వాత ఢిల్లీకి బయలుదేరిన విమానం
ఆస్ట్రియా రాజధాని వియన్నా నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని శుక్రవారం దుబాయ్‌కు మళ్లించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

ఏఐ-154 విమానం వియన్నా నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని సమీపంలోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు. విమానం దుబాయ్‌లో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనపై ఎయిరిండియా ప్రతినిధి స్పందిస్తూ "సాంకేతిక సమస్య తలెత్తినట్టు అనుమానం రావడంతో విమానాన్ని దుబాయ్‌కు మళ్లించాం. అక్కడ విమానానికి అవసరమైన అన్ని తనిఖీలు పూర్తి చేశాం. ఈ ఆలస్యం గురించి ప్రయాణికులకు తెలియజేసి, వారికి అల్పాహారం ఏర్పాటు చేశాం. తనిఖీల అనంతరం విమానం భారత కాలమానం ప్రకారం ఉదయం 8:45 గంటలకు దుబాయ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది" అని వివరించారు.

ఇటీవల కాలంలో ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం ఇది రెండోసారి. గత ఆగస్టులో తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానాన్ని కూడా ఇలాగే సాంకేతిక కారణాలతో చెన్నైకి మళ్లించారు. ఆ విమానంలో ప్రయాణించిన కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్, తాము ల్యాండ్ అవుతున్న సమయంలో అదే రన్‌వేపైకి మరో విమానం వచ్చిందని, త్రుటిలో ప్రమాదం తప్పిందని ఆరోపించారు. అయితే, ఆయన ఆరోపణలను ఎయిరిండియా ఖండించింది. కేవలం సాంకేతిక సమస్య కారణంగానే విమానాన్ని మళ్లించాల్సి వచ్చిందని అప్పట్లో స్పష్టం చేసింది.
Air India
Air India flight
Vienna
Delhi
Dubai
flight diversion
technical issue
aircraft
aviation safety

More Telugu News