H-1B Visa: భారతీయ నిపుణుల ఆశలపై నీళ్లు.. హెచ్-1బీ సంస్కరణలకు అమెరికా పచ్చజెండా

H1B Visa Reforms dampen Indian Professionals hopes in US
షార్ట్స్‌లో చూడండి
అమెరికాలో ఉద్యోగం చేయాలని ఆశించే వేలాది మంది భారతీయ విద్యార్థులు, యువ నిపుణులకు ఇది ఆందోళన కలిగించే వార్త. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా కార్యక్రమంపై సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వీసా రుసుము పెంపు ప్రతిపాదనలతో ఆందోళన నెలకొనగా, తాజాగా వీసాల జారీ, వినియోగం, అర్హత ప్రమాణాలపై మరిన్ని కఠిన నిబంధనలను విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే, భారతీయ నిపుణుల అమెరికా కల మరింత సంక్లిష్టంగా మారనుంది.

అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్), ‘హెచ్-1బీ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా వర్గీకరణ కార్యక్రమ సంస్కరణ’ పేరిట ఫెడరల్ రిజిస్టర్‌లో కొత్త ప్రతిపాదనలను నమోదు చేసింది. ఈ ప్రతిపాదనల ముఖ్య ఉద్దేశం "అమెరికా కార్మికుల వేతనాలు, పని పరిస్థితులను మెరుగ్గా పరిరక్షించడం, హెచ్-1బీ కార్యక్రమ సమగ్రతను పెంచడం" అని ప్రభుత్వం పేర్కొంది. ఈ సంస్కరణల్లో భాగంగా వీసా నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై మరింత నిఘా పెట్టడం, థర్డ్-పార్టీ ప్లేస్‌మెంట్‌లను కఠినంగా పర్యవేక్షించడం వంటి అంశాలు ఉన్నాయి.

ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, లాభాపేక్ష లేని పరిశోధన సంస్థలు, ఆరోగ్య సంరక్షణ సంస్థలకు వార్షిక వీసా పరిమితి (క్యాప్) నుంచి మినహాయింపులు ఉన్నాయి. తాజా ప్రతిపాదనల్లో భాగంగా ఈ మినహాయింపులను కూడా ప్రభుత్వం పునఃసమీక్షించే అవకాశం ఉందని ‘న్యూస్‌వీక్’ పత్రిక వెల్లడించింది. అదే జరిగితే ఈ సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ కొత్త నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఏడాది డిసెంబర్ నాటికి అధికారికంగా వెలువడవచ్చని రెగ్యులేటరీ నోటీసులో సూచించారు.

ప్రస్తుతం ఉన్న లాటరీ విధానం స్థానంలో అధిక వేతనం పొందే వారికి ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని కూడా ట్రంప్ ప్రభుత్వం గతంలో పరిశీలించింది. హెచ్-1బీ వీసా అనేది అమెరికాలో దీర్ఘకాలం పనిచేసి, శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) పొందాలనుకునే భారతీయ నిపుణులకు అత్యంత కీలకమైన మార్గం. 2023లో ఆమోదం పొందిన హెచ్-1బీ వీసాలలో దాదాపు మూడొంతుల మంది భారతీయులే ఉండటం దీని ప్రాధాన్యతను తెలియ‌జేస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ప్రతిపాదనలు భారతీయ టెకీలు, నిపుణుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి.
Go Back to Shorts
H-1B Visa
Indian professionals
US immigration
Donald Trump
H1B visa reforms
United States
visa rules
green card
Indian techies
Department of Homeland Security

More Telugu News