Donald Trump: ఒబామాను టార్గెట్ చేసిన ట్రంప్.. నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటం

Donald Trump Says Obama Did Nothing to Deserve Nobel Peace Prize
  • నోబెల్ శాంతి బహుమతిపై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • ఒబామా ఏమీ చేయకుండానే అవార్డు పొందారని తీవ్ర విమర్శ
  • మాజీ అధ్యక్షుడు దేశాన్ని నాశనం చేశారని ఘాటు వ్యాఖ్య‌లు
  • తాను 8 యుద్ధాలను ఆపానని, గాజాలో శాంతిని నెలకొల్పానని వెల్లడి
  • నోబెల్ కమిటీని ప్రభావితం చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారనే వాదనలు
నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు కొన్ని గంటల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒబామా అధ్యక్షుడైన కొన్ని నెలలకే ఆయనకు నోబెల్ బహుమతి ఇచ్చారని, కానీ ఆయన దేశానికి ఏమీ చేయలేదని, పైగా దేశాన్ని నాశనం చేశారని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఒబామాకు ఎందుకు బహుమతి ఇచ్చారో ఆయనకే తెలియదు. ఆయన ఎన్నికయ్యారు, అంతే. ఏమీ చేయనందుకే ఆయనకు నోబెల్ ఇచ్చారు. ఆయన దేశాన్ని నాశనం చేయడం తప్ప చేసిందేమీ లేదు" అని ట్రంప్ ఆరోపించారు. తాను మాత్రం గాజాలో శాంతిని నెలకొల్పడంతో పాటు, ఏకంగా 8 యుద్ధాలను ఆపానని చెప్పుకున్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదరడంలో తన పాత్ర ఉందని ఆయన గుర్తుచేశారు.

అయితే, తాను ఈ పనులన్నీ అవార్డు కోసం చేయలేదని ట్రంప్ స్పష్టం చేశారు. "నేను ఎన్నో ప్రాణాలను కాపాడాను. అందుకే ఈ పనులు చేశాను. వాళ్లు (నోబెల్ కమిటీ) ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఫర్వాలేదు" అని ఆయన అన్నారు.

2009లో ఒబామా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన 8 నెలలకే నోబెల్ శాంతి బహుమతి పొందడం అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇది చాలా తొందరపాటు చర్య అని, నోబెల్ పురస్కారానికి మరింత ఉన్నత ప్రమాణాలు ఉండాలని ప్రముఖ పత్రిక 'న్యూయార్క్ టైమ్స్' కూడా వ్యాఖ్యానించింది. కాగా, జనవరిలో ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి నోబెల్ కమిటీని ప్రభావితం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాను పలు యుద్ధాలను ఆపానని ఆయన చెప్పుకుంటున్నప్పటికీ, వీటిలో కొన్ని దేశాలు మాత్రం ఈ వాదనలను అంగీకరించడం లేదు.
Donald Trump
Barack Obama
Nobel Peace Prize
US President
Israel Hamas
Gaza Peace
White House
New York Times
US Politics

More Telugu News