Andhra Pradesh: బకాయిల గండం.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

NTR Vaidya Seva Services Halted Across Andhra Pradesh Due to Unpaid Dues
  • రూ. 2,700 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆస్పత్రుల డిమాండ్
  • సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన 'ఆశా'
  • ప్రభుత్వంతో విఫలమైన చర్చలు, ఫలించని హామీలు
  • సమ్మె విరమించాలని ఆస్పత్రులకు మంత్రి సత్యకుమార్ విజ్ఞప్తి
  • గత ప్రభుత్వ బకాయిలే కారణమంటున్న ఆరోగ్య మంత్రి
ప్రభుత్వం నుంచి రావాల్సిన భారీ బకాయిల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముందుగా హెచ్చరించినట్లే, శుక్రవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశాయి. రూ. 2,700 కోట్లకు పైగా బిల్లులు పేరుకుపోవడంతో, ఆర్థికంగా ఆస్పత్రులను నడపలేమని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా) స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా పేద, మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.

గత నెల 25వ తేదీనే ప్రభుత్వానికి లేఖ రాసినట్లు 'ఆషా' గుర్తుచేసింది. బకాయిలు చెల్లించకపోతే అక్టోబర్ 10 నుంచి సేవలు అందించలేమని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపింది. ఈ సమస్యపై ఆరోగ్య శాఖ అధికారులు ప‌లుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా 'అదిగో ఇదిగో' అంటూ హామీలు ఇస్తున్నారే తప్ప, బకాయిలు విడుదల చేయడం లేదని 'ఆశా' ఆరోపించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నా ప్రయోజనం లేకపోయిందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది.

గత ప్రభుత్వానిదే పాపం.. సేవలు ఆపొద్దు: మంత్రి సత్యకుమార్ విజ్ఞప్తి
ఈ పరిణామంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు. సేవలను నిలిపివేయవద్దని ఆస్పత్రుల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబుతో చర్చించి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రూ. 3,800 కోట్లు చెల్లించామని గుర్తుచేశారు. "గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన రూ. 2,500 కోట్ల బకాయిల వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. బిల్లులు చెల్లించకపోతే ఆస్పత్రులు నడపడం కష్టమని మాకు తెలుసు. ఇటీవలే రూ. 250 కోట్లు విడుదల చేశాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా యాజమాన్యాలు అర్థం చేసుకోవాలి" అని మంత్రి కోరారు.

ప్రస్తుతం రూ. 670 కోట్ల బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌కు అప్‌లోడ్ చేశామని, మరో రూ. 2,000 కోట్ల బిల్లులు పరిశీలన దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ, బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు సేవలను పునరుద్ధరించేది లేదని ఆస్పత్రులు స్పష్టం చేయడంతో రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
Andhra Pradesh
NTR Vaidya Seva
AP Specialty Hospitals Association
Asha
Satya Kumar
Chandrababu Naidu
Healthcare
Medical Services
Government Dues
Hospital Bills

More Telugu News