సోషల్ మీడియాలో అసత్య ప్రచారం.. టీటీడీ ఫిర్యాదుతో కేసు నమోదు

  • టీటీడీపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్
  • మహ్మద్ రఫీక్ అనే వ్యక్తిపై కేసు నమోదు
  • అన్నప్రసాద భవనంలో రీల్స్‌కు తప్పుడు క్యాప్షన్
  • టీటీడీ ఛైర్మన్, సిబ్బందిని కించపరిచేలా వ్యాఖ్యలు
  • టీటీడీ విజిలెన్స్ విభాగం ఫిర్యాదు
టీటీడీ ప్రతిష్ఠ‌కు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణలపై ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. టీటీడీ విజిలెన్స్ విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహ్మద్ రఫీక్ అనే వ్యక్తిపై తిరుమల వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళితే... మహ్మద్ రఫీక్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఓ యువతి చేసిన రీల్స్‌కు, ‘ఇది బీఆర్‌ నాయుడు బాగోతం.. టీటీడీలో చాలా అభ్యంతరకర ప్రవర్తన.. భూమన షాకింగ్‌ నిజాలు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలను జోడించారు. ఈ పోస్ట్ ద్వారా టీటీడీ ఛైర్మన్‌తో పాటు సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం చేశారు.

ఈ పోస్ట్ టీటీడీ విజిలెన్స్ అధికారుల దృష్టికి రావడంతో వారు తీవ్రంగా స్పందించారు. టీటీడీ ఏవీఎస్వో వెంకట నగేశ్‌ బాబు బుధవారం తిరుమల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేశారు. ఈ పోస్ట్ ద్వారా తిరుమల పవిత్రతను దెబ్బతీయడంతో పాటు, ప్రజల్లో అపోహలు, ద్వేష భావాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరిగిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

టీటీడీ విజిలెన్స్ విభాగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వన్‌టౌన్ పోలీసులు నిన్న‌ రాత్రి మహ్మద్ రఫీక్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.


More Telugu News