Nara Lokesh: పెండింగ్ ప్రోత్సాహకాలు వెంటనే చెల్లిస్తాం... ఐటీ కంపెనీలకు లోకేశ్ భరోసా

Nara Lokesh Assures IT Companies of Pending Incentives
  • ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు పెండింగ్ ప్రోత్సాహకాలు వెంటనే చెల్లించాలని నిర్ణయం
  • రాబోయే ఐదేళ్లలో ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రణాళిక
  • రానున్న రెండు నెలల్లో వాట్సాప్ ద్వారా వెయ్యి ప్రభుత్వ సేవలు అందుబాటులోకి
  • రేపటి కేబినెట్ భేటీలో క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • గూగుల్, టీసీఎస్ వంటి సంస్థల కార్యకలాపాలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఐదేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంస్థలకు పూర్తి భరోసా కల్పిస్తామని, ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలను త్వరలోనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... స్టార్టప్ ల వృద్ధిలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ ను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని, మరో రెండు నెలల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వెయ్యి సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు నిర్దేశించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీపైనా సమావేశంలో చర్చించారు. రేపటి కేబినెట్ సమావేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీని ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్, ఇన్నోవేషన్ సొసైటీ, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ పైనా సమావేశంలో చర్చించారు.

రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ఆయా పరిశ్రమలతో నిత్యం సంప్రదింపులు జరపాలని ఈడీబీ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడులు, ఆయా పెట్టుబడుల ప్రస్థుత స్థితిపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో గూగుల్, సత్వా, టీసీఎస్, ఏఎన్ఎస్ఆర్ వంటి కంపెనీలు త్వరితగతిన తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్లస్టర్ వారీగా పరిశ్రమల స్థాపనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యం అని, ఇందుకు టాప్-100 డెవలపర్స్, ఐటీ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఈ సమావేశంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ కాటంనేని భాస్కర్, స్పెషల్ సెక్రటరీ బి.సుందర్, ఏపీటీఎస్ ఎండీ సూర్యతేజ, ఎస్పీ మల్లికా గార్గ్, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ గీతాంజలి శర్మ, ఆర్టీఐహెచ్ సీఈవో పి.ధాత్రి రెడ్డి, ఆర్టీజీఎస్ అడిషనల్ సీఈవో సౌర్యమాన్ పటేల్, ఈడీబీ సీఈవో శశికాంత్ వర్మ, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిశోర్, జీఎం విజయ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.

Nara Lokesh
Andhra Pradesh
IT sector
Electronics industry
Investment incentives
Job creation
Startup ecosystem
Quantum computing policy
Google
TCS

More Telugu News