Chandrababu Naidu: రైతుకు ధర దక్కాలి... వినియోగదారుడికి ధర తగ్గాలి... ఇదే మన లక్ష్యం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Focus on Farmer and Consumer Price Balance
  • రైతుకు లాభం, వినియోగదారుడికి మేలు లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సీఎం ఆదేశం
  • రాష్ట్రంలోని 218 మార్కెట్ యార్డుల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచన
  • రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రీయ సాగును ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి
  • రైతు బజార్ల ఆధునికీకరణ, మొబైల్ బజార్ల ఏర్పాటు అంశం పరిశీలించాలని ఆదేశం
  • రబీ సీజన్‌కు ఎరువుల పంపిణీలో పక్కా ప్రణాళిక, అక్రమాలకు తావివ్వొద్దని హెచ్చరిక
"రైతు పండించిన పంటకు సరైన ధర దక్కాలి, అదే సమయంలో ఆ పంటను కొనుగోలు చేసే వినియోగదారుడిపై అధిక భారం పడకూడదు. ఈ రెండింటినీ సమన్వయం చేయడమే మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు ఈ దిశగా కలిసి పనిచేసి, రైతులు, ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. 

నేడు సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.

మార్కెట్ యార్డుల ఆధునికీకరణకు మాస్టర్ ప్లాన్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 218 వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్రమైన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డుల పరిధిలోని ఖాళీ స్థలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. "మార్కెట్ యార్డుల్లో కోల్డ్ చైన్ వ్యవస్థలు, అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లు వంటివి ఏర్పాటు చేయాలి. దీనివల్ల పంట నిల్వ సామర్థ్యం పెరిగి, రైతులకు మెరుగైన ధర లభిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. 

రైతు బజార్లను పూర్తిస్థాయిలో ఆధునికీకరించాలని, పట్టణ ప్రాంతాల్లో అవసరమైన భూమిని అంచనా వేయాలని చెప్పారు. రైతు బజార్లకు అనుసంధానంగా మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలించాలని తెలిపారు. నిధుల సమీకరణ కోసం మార్కెట్ కమిటీలు, రైతు బజార్లను కలిపి ఒక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటీవల పత్తికొండలో టమాటో ధరలు పడిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అలాంటి పరిస్థితుల్లో పంటను నేరుగా రైతు బజార్లకు తరలించి ప్రజలకు అందుబాటు ధరలకు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు.

రసాయనాలకు చెక్.. సేంద్రియ సాగుకు జై

రసాయన ఎరువులు, పురుగుమందుల మితిమీరిన వాడకంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. "ఎక్కువ యూరియా వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందనే అపోహతో రైతులు భూసారాన్ని దెబ్బతీస్తున్నారు. ఈ ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యం కూడా పాడవుతోంది. ఈ విధానానికి స్వస్తి పలకాలి" అని అన్నారు. 

2026 ఖరీఫ్ నాటికి సేంద్రీయ సాగును గణనీయంగా పెంచేలా, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేలా రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. భూసారాన్ని పెంచే పోషకాలపై దృష్టి సారించి, ప్రకృతి సేద్యం వల్ల కలిగే ఆర్థిక, ఆరోగ్య ప్రయోజనాలను రైతులకు వివరించాలని చెప్పారు. రైతులకు అన్ని రకాల సేవలు అందించేలా రైతు సేవా కేంద్రాలను పునర్వ్యవస్థీకరించాలని తెలిపారు.

రబీకి పక్కా ప్రణాళిక.. ఎరువుల పంపిణీపై కఠిన వైఖరి

రబీ సీజన్‌కు ఎరువుల కొరత లేకుండా చూడాలని, పంపిణీలో పారదర్శకత పాటించాలని సీఎం స్పష్టం చేశారు. అధికారులు రబీకి 23 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని వివరించారు. 

దీనిపై సీఎం స్పందిస్తూ, "భూసార పరీక్షల నివేదికల ఆధారంగా రైతులకు ఎంత ఎరువు అవసరమో నిర్దేశించాలి. సాగు విస్తీర్ణాన్ని బట్టి సరఫరా జరగాలి. ఆధార్ ఆధారితంగానే యూరియా పంపిణీ చేసి, అక్రమ రవాణాను అరికట్టాలి. ప్రతి రైతు, కౌలు రైతుకు ఎంత యూరియా ఇచ్చారనే దానిపై పక్కా రికార్డులు నిర్వహించాలి" అని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ధాన్యం సేకరణ లక్ష్యం గత ఏడాదితో పోలిస్తే 44 శాతం అధికంగా 51 లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్దేశించినట్లు అధికారులు తెలపగా, రైతులకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు.

ప్రత్యామ్నాయ పంటలు.. అనుబంధ రంగాలపై దృష్టి

ఈ సమీక్షలో, ప్రధాని ప్రారంభించనున్న ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’పై కూడా చర్చించారు. ఈ పథకం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. సెరీకల్చర్ (పట్టు పరిశ్రమ) రంగంలో కర్ణాటకతో పోలిస్తే ఏపీ వెనుకబడి ఉండటంపై విశ్లేషణ చేయాలన్నారు. పట్టు ఉత్పత్తి యంత్రాలను ఎంఎస్ఎంఈల ద్వారా సబ్సిడీపై అందించాలని, ఈ రంగంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం కూడా తీసుకోవాలని చెప్పారు. 

ఉల్లి, టమాటో, మిర్చి వంటి పంటల విషయంలో ధరలు పడిపోకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో జీలుగు బెల్లం, వెదురు ఉత్పత్తులను అరకు కాఫీ తరహాలో ప్రోత్సహించాలని, పుట్టగొడుగుల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. ఈ సందర్భంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి వివిధ పంటల మద్దతు ధరల పోస్టర్‌ను ముఖ్యమంత్రి విడుదల చేశారు.
Chandrababu Naidu
Farmer welfare
Agriculture AP
Rythu Bazar
Organic farming
Fertilizer distribution
AP agriculture policy
Market yards
Crop price
Andhra Pradesh

More Telugu News