Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ పార్టీ తొలి జాబితాలో గణిత మేధావి, డాక్టర్లు, లాయర్లు... కనిపించని పీకే పేరు

Prashant Kishor Jan Suraaj Party First List Out
  • బీహార్ ఎన్నికల కోసం జన్ సురాజ్ పార్టీ తొలి జాబితా విడుదల
  • 51 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించిన ప్రశాంత్ కిశోర్
  • అవినీతి రహిత ఇమేజ్ ఉన్నవారికే పెద్దపీట
రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్, తన జన్ సురాజ్ పార్టీతో బీహార్ రాజకీయాల్లో సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 51 మందితో కూడిన తమ పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను గురువారం మధ్యాహ్నం ప్రకటించారు. రాజకీయాల్లో అవినీతిని రూపుమాపాలనే లక్ష్యంతో, సమాజంలో మంచి పేరున్న విద్యావంతులు, నిపుణులను బరిలోకి దించుతూ ఆయన తీసుకున్న నిర్ణయం ఆసక్తిని రేపుతోంది.

ఈ జాబితాలో రాజకీయ నాయకులే కాకుండా తరతరాలుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త, మాజీ ఉన్నతాధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, వైద్యులు ఉండటం విశేషం. కుమ్రార్ నియోజకవర్గం నుంచి జన్ సురాజ్ అభ్యర్థిగా కేసీ సిన్హాను ప్రకటించారు. పాట్నా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేసిన ఆయన రచించిన గణిత పుస్తకాలు బీహార్‌తో పాటు అనేక రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ప్రామాణికంగా ఉన్నాయి.

అలాగే, పాట్నా హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ అయిన వైబీ గిరిని మంఝీ నుంచి బరిలోకి దించారు. ఆయన గతంలో బీహార్ అదనపు అడ్వకేట్ జనరల్‌గా, కేంద్ర ప్రభుత్వ కేసుల కోసం అదనపు సొలిసిటర్ జనరల్‌గా కూడా పనిచేశారు. ముజఫర్‌పూర్ స్థానం నుంచి పాట్నా మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి డాక్టర్ అమిత్ కుమార్ దాస్‌కు టికెట్ కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

మొదటి జాబితాలో 16 శాతం మంది ముస్లింలకు, 17 శాతం మంది అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన వారికి అవకాశం కల్పించారు. అయితే, ఈ జాబితాలో ప్రశాంత్ కిశోర్ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తన సొంత నియోజకవర్గమైన కరహగర్ నుంచి గానీ, ఆర్జేడీ కంచుకోట, తేజస్వి యాదవ్ స్థానమైన రాఘోపూర్ నుంచి గానీ పోటీ చేయాలని భావిస్తున్నట్టు గతంలో తెలిపారు. తాజా జాబితాలో కరహగర్ నుంచి రితేష్ రంజన్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో, ఆయన నేరుగా తేజస్వి యాదవ్‌తోనే తలపడొచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 
Prashant Kishor
Jan Suraaj Party
Bihar Elections
Bihar Politics
KC Sinha
YB Giri
Tejaswi Yadav
RJD
Political strategist
Bihar assembly elections

More Telugu News