Bandi Sanjay: స్థానిక ఎన్నికలు ఇజ్జత్ కా సవాల్.. గెలిస్తేనే పలుకుబడి: బండి సంజయ్

Bandi Sanjay Warns Party Leaders on Local Elections
  • స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలన్న బండి సంజయ్
  • తనకు గ్రూపులు లేవని వెల్లడి
  • రాష్ట్ర నాయకత్వమే అభ్యర్థులను వెల్లడిస్తుందన్న సంజయ్
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సొంత పార్టీ నేతలకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయడం కన్నతల్లికి ద్రోహం చేయడంతో సమానమని, అంతకంటే నీచమైన పని మరొకటి ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని బూత్ స్థాయి అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులతో ఈరోజు ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, "నాకు ఎలాంటి గ్రూపులూ లేవు, బీజేపీయే నా గ్రూప్. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసమే ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి" అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నాయకులు తమ సొంత గ్రామాల్లో, మండలాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే వారికి గౌరవం, పలుకుబడి ఉంటాయని తేల్చిచెప్పారు.

అభ్యర్థుల ఎంపికపై మాట్లాడుతూ, "గెలుపు అవకాశాలే ప్రామాణికంగా సర్వే నివేదికల ఆధారంగా రాష్ట్ర నాయకత్వమే అభ్యర్థులను ప్రకటిస్తుంది. ఈ విషయంలో నా అభిప్రాయం మాత్రమే అంతిమం కాదు" అని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు ఎలా ఉన్నప్పటికీ, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, టిక్కెట్లు ఆశించే వారు నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వమే నిధులు అందిస్తోందని బండి సంజయ్ అన్నారు. "దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామానికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిధులిచ్చిన ఏకైక ఎంపీని నేనే. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలకు నయా పైసా ఇవ్వడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేంద్ర నిధులను దారి మళ్లించి పల్లెలను నాశనం చేసింది" అని ఆయన ఆరోపించారు. అటువంటప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలకు ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ప్రతి ఇంటికి మూడుసార్లు వెళ్లి ఓటు అభ్యర్థించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 
Bandi Sanjay
Karimnagar
Local Body Elections
BJP
Telangana Elections
Party Cadre
Central Funds
Village Development
Telangana Politics
BRS

More Telugu News