India Women's Cricket Team: విశాఖలో వర్షం... ఆలస్యంగా భారత్, దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ మ్యాచ్

India Women vs South Africa Women World Cup Match Delayed by Rain in Visakhapatnam
  • ఆలస్యంగా మొదలవనున్న భారత్ కీలక పోరు
  • రెండుసార్లు మైదానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అంపైర్లు
  • టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా
  • ఓవర్లు కుదించకుండానే మ్యాచ్ జరిపే అవకాశం
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరగాల్సిన ప్రపంచకప్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. అయితే, కాసేపటికే వాతావరణం అనుకూలించడంతో ఓవర్ల కుదింపు లేకుండానే పూర్తి మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

గురువారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో వర్షం మొదలవడంతో మ్యాచ్ నిర్వహణపై ఆందోళన నెలకొంది. షెడ్యూల్ ప్రకారం 2:30 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా, చిరుజల్లుల కారణంగా అది సాధ్యపడలేదు. అయితే, ముందుగానే అప్రమత్తమైన గ్రౌండ్ సిబ్బంది వెంటనే మైదానాన్ని కవర్లతో కప్పివేశారు. సుమారు 30-35 నిమిషాల పాటు వర్షం కురిసింది.

వర్షం ఆగిపోయిన తర్వాత, సూపర్ సాపర్లతో మైదానాన్ని సిద్ధం చేసే పనులను సిబ్బంది వేగవంతం చేశారు. అనంతరం అంపైర్లు రెండుసార్లు, మొదట 2:45 గంటలకు, ఆ తర్వాత 3:10 గంటలకు మైదానాన్ని పరిశీలించారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత, మ్యాచ్‌ను 4 గంటలకు ప్రారంభించాలని నిర్ణయించారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ ప్రపంచకప్‌లో ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం. తొలి రెండు మ్యాచుల్లో గెలిచి జోరు మీదున్న భారత జట్టు, తమ విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు, తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా జట్టు, ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో పట్టు సాధించాలని భావిస్తోంది. ఆటగాళ్లు ఇప్పటికే వార్మప్ పూర్తి చేసుకుని కీలక పోరుకు సిద్ధమయ్యారు.
India Women's Cricket Team
South Africa Women's Cricket Team
ICC Women's World Cup
Visakhapatnam
ACA-VDCA Stadium
womens world cup match
cricket match delay
rain delay
womens cricket
india vs south africa

More Telugu News