ఏపీలో వ్యవసాయంపై సీఎం చంద్రబాబు ఫోకస్.. ఆర్ఎస్కేల ప్రక్షాళనకు ఆదేశం

  • సచివాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) పునర్‌వ్యవస్థీకరణకు ఆదేశం
  • భూసారం పెంచి ఉత్పాదకత సాధించాలని అధికారులకు సూచన
  • 2026 ఖరీఫ్ నాటికి సేంద్రియ సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలన్న సీఎం
  • రసాయన ఎరువుల వాడకం తగ్గింపుపై రైతులకు అవగాహన కల్పించాలన్న చంద్ర‌బాబు
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కొత్త దిశానిర్దేశం చేసేలా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) స్వరూపాన్ని పూర్తిగా మార్చి, వాటిని రైతులకు సమస్త సేవలు అందించే కీలక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో వ్యవసాయ శాఖ పనితీరుపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన రైతులకు ప్రభుత్వ సేవలు అందించడంలో ఆర్ఎస్కేలే ప్రధాన పాత్ర పోషించాలని స్పష్టం చేశారు. రైతులు ప్రతి చిన్న అవసరానికి వేర్వేరు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని, అన్ని సేవలు ఒకేచోట లభించేలా ఆర్ఎస్కేలను పునర్‌వ్యవస్థీకరించాలని సూచించారు.

రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు భూసారాన్ని పరిరక్షించడం అత్యంత ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. భూమికి అవసరమైన పోషకాలను అందించి, సారాన్ని పెంచడం ద్వారానే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని తెలిపారు. భూసారంలో ఉన్న లోపాలను శాస్త్రీయంగా గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాబోయే రోజుల్లో సేంద్రియ, ప్రకృతి సేద్యానికి పెద్దపీట వేయాలని సీఎం స్పష్టం చేశారు. 2026 ఖరీఫ్ సీజన్ నాటికి రైతులు పెద్ద ఎత్తున సేంద్రియ సాగు చేపట్టేలా ప్రోత్సహించాలని లక్ష్యంగా నిర్దేశించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం వల్ల పర్యావరణానికి, రైతు ఆరోగ్యానికి, ఆర్థికంగా కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో వివరించి వారిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న ఏ మార్పు అయినా క్షేత్రస్థాయి సిబ్బందికి ముందుగా పూర్తిస్థాయిలో తెలిసి ఉండాలని, అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.


More Telugu News