DK Shivakumar: డీకే శివకుమార్ ఎంట్రీ... తెరుచుకున్న కన్నడ బిగ్ బాస్ హౌస్

Kannada Big Boss house reopens after DK Shivakumar intervention
  • కాలుష్య ఆరోపణలతో కన్నడ బిగ్‌బాస్ హౌస్‌కు అధికారుల సీల్
  • నోటీసులు పట్టించుకోలేదని నిర్వాహకులపై అధికారుల చర్యలు
  • రంగంలోకి దిగిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
  • మరో అవకాశం ఇవ్వాలంటూ అధికారులకు కీలక ఆదేశాలు
  • గంటల వ్యవధిలోనే తెరుచుకున్న బిగ్‌బాస్ హౌస్ డోర్లు
కన్నడ బిగ్‌బాస్ షోకు ఎదురైన పెద్ద అడ్డంకి తొలగిపోయింది. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మంగళవారం సీల్ వేసిన బిగ్‌బాస్ హౌస్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జోక్యంతో తిరిగి తెరుచుకుంది. దీంతో షో నిర్వాహకులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

బిగ్‌బాస్ షో చిత్రీకరణ జరుగుతున్న బిడదిలోని ‘జాలీవుడ్’ స్టూడియో నుంచి ప్రతిరోజూ దాదాపు 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీటిని బయటకు వదులుతున్నారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు షో నిర్వాహకులకు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయితే, ఆ నోటీసులను నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో, తహసీల్దారు తేజస్విని నేతృత్వంలోని అధికారుల బృందం మంగళవారం బిగ్‌బాస్ హౌస్‌కు బయటి నుంచి తాళాలు వేసి సీల్ చేసింది.

ఈ విషయం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. స్టూడియోకు మరో అవకాశం ఇవ్వాలని బెంగళూరు సౌత్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండటంతో పాటు, కన్నడ వినోద పరిశ్రమకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. డీసీఎం ఆదేశాలతో అధికారులు వెంటనే బిగ్‌బాస్ హౌస్‌కు వేసిన సీల్‌ను తొలగించారు.

ఈ పరిణామంపై షో వ్యాఖ్యాత కిచ్చా సుదీప్ హర్షం వ్యక్తం చేశారు. సరైన సమయంలో జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించినందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు, సహకరించిన అధికారులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 
DK Shivakumar
Kannada Big Boss
Big Boss Kannada
Kichcha Sudeep
Karnataka
Jollywood Studio
Pollution Control Board
entertainment industry
रियलिटी शो
ಬಿಗ್ ಬಾಸ್ ಕನ್ನಡ

More Telugu News