ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో ఫ్లైయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధుల భేటీ .. 500 కోట్ల పెట్టుబడులకు సంసిద్ధత

  • మంత్రి జనార్దన్ రెడ్డితో సమావేశమైన నల్వా ఏరో ప్రైవేటు లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు కుల్జిత్ ఎస్. సంధూ 
  • సంస్థ ఏర్పాటుకు వంద ఎకరాలు అవసరమని వినతి
  • పూర్తి స్థాయి ప్రతిపాదనలతో వస్తే అన్ని విధాలుగా సహకరిస్తామన్న మంత్రి  
ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధులు నిన్న సచివాలయంలో ఆర్ అండ్ బీ శాఖ కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు నల్వా ఏరో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకులు కుల్జిత్ ఎస్. సంధూ మంత్రి వద్ద తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.

దేశంలో మొదటి 5 సీటర్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) విమానాన్ని అభివృద్ధి చేస్తోన్న సంస్థ నల్వా ఏరో ప్రైవేట్ లిమిటెడ్. అంతే కాకుండా దేశంలో మొదటి 5 సీటర్ (eVTOL) ఫ్లైట్‌కు DGCA నుంచి డిజైన్ ఆర్గనైజేషన్ అప్రూవల్ (DOA) పొందిన ఏకైక సంస్థ.

అధునాతన ఎయిర్ మొబిలిటీ (AAM) కోసం లాంగ్-రేంజ్ ప్యాసింజర్ eVTOL విమానాలను తయారు చేయాలనే లక్ష్యంతో పంజాబ్‌కు చెందిన ఈ సంస్థ పని చేస్తోంది. ఆర్ అండ్ ఆర్ సెంటర్, ప్రోటో టైప్ డెవలప్‌మెంట్ యూనిట్, eVTOL విమానాల కోసం పూర్తి స్థాయి తయారీ సౌకర్యం, eVTOL పైలట్ల కోసం ప్రపంచ స్థాయి ఫ్లయింగ్ శిక్షణా సంస్థలు ఏర్పాటుకు దాదాపు 100 ఎకరాల భూమి అవసరమని సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు.

అనంతపురం పరిసర ప్రాంతాల్లో రూ.500 కోట్లతో తమ సంస్థ ఏర్పాటుకు కంపెనీ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ కల్పనకు రాబోయే 10 ఏళ్లలో దాదాపు రూ. 800 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయి ప్రతిపాదనలతో ముందుకు వస్తే, ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకరిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ సంస్థ ఏర్పాటు వల్ల దాదాపు వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. 


More Telugu News