Delhi: ఢిల్లీలో దారుణం.. నిద్రపోతున్న భర్తపై మరిగే నూనె, కారం పొడితో భార్య దాడి

Delhi Woman Attacks Sleeping Husband With Boiling Oil Chilli Powder says Cops
  • ఢిల్లీలో భర్తపై భార్య కిరాతక దాడి
  • నిద్రలో ఉన్నప్పుడు మరిగే నూనెతో దాడి
  • గాయాలపై కారం చల్లి పైశాచిక ప్రవర్తన
  • తీవ్ర గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడు
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్త గాఢ నిద్రలో ఉండగా, ఓ భార్య అతి కిరాతకంగా ప్రవర్తించింది. మరిగే నూనెను అతని ముఖం, శరీరంపై పోసి చిత్రహింసలకు గురిచేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే... ఢిల్లీలోని మదన్‌గిర్‌ ప్రాంతంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఫార్మా కంపెనీలో పనిచేసే 28 ఏళ్ల దినేశ్‌ అనే వ్యక్తిపై అతని భార్య ఈ దాడికి పాల్పడింది. ఈ నెల‌ 3వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో దినేశ్‌ తన 8 ఏళ్ల కుమార్తెతో కలిసి నిద్రిస్తున్నాడు. అదే సమయంలో అతని భార్య మరిగే నూనెను తీసుకొచ్చి అతని ముఖం, ఛాతీపై పోసింది. తీవ్రమైన కాలిన గాయాలతో బాధపడుతున్న అతడిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

పోలీసులకు దినేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఈ నెల‌ 2న పని ముగించుకుని ఆలస్యంగా ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రపోయాడు. తెల్లవారుజామున 3:15 గంటల ప్రాంతంలో శరీరంపై తీవ్రమైన మంట పుట్టడంతో అతడు ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా భార్య నిలబడి నూనె పోయడం చూసి షాక్‌కు గురయ్యాడు. అతను తేరుకునేలోపే, కాలిన గాయాలపై కారం చల్లింది. నొప్పితో కేకలు వేయబోగా, ‘అరిస్తే ఇంకా నూనె పోస్తా’ అని ఆమె బెదిరించినట్లు దినేశ్ తెలిపాడు.

అయినా నొప్పిని భరించలేక అతను గట్టిగా అరవడంతో, శబ్దాలు విని ఇరుగుపొరుగు వారు, కింది అంతస్తులో ఉండే ఇంటి యజమాని కుటుంబం పైకి పరుగెత్తుకొచ్చారు. ఇంటి యజమాని కుమార్తె అంజలి మాట్లాడుతూ, “మేము పైకి వెళ్లేసరికి తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. చాలాసేపటి తర్వాత తలుపు తీయగా, దినేశ్‌ నొప్పితో విలవిలలాడుతున్నాడు. అతని భార్య ఇంట్లో దాక్కుంది” అని తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి, ఆమె దినేశ్‌ను వేరే వైపు తీసుకెళ్లడంతో అనుమానం వచ్చి, తామే ఆటో ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించామని ఆమె వివరించారు.

దినేశ్‌ గాయాలు ప్రమాదకరమైనవని వైద్యులు వెల్ల‌డించారు. ఎనిమిదేళ్ల క్రితం వీరికి వివాహం కాగా, గత కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. రెండేళ్ల క్రితం భార్య క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్ (సీఏడ‌బ్ల్యూ) సెల్‌లో ఫిర్యాదు చేయగా, రాజీ కుదిరింది. ప్రస్తుతం ఆమెపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఓ అధికారి తెలిపారు.
Delhi
Delhi crime
domestic violence
hot oil attack
crime news
India crime
Madan Gir
CAW cell
Safdarjung Hospital
attempted murder

More Telugu News