Chandrababu Naidu: సీఆర్డీఏ సమావేశం... 18 అంశాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

Chandrababu Naidu Focuses on Amaravati Development and Farmer Welfare
  • అమరావతి పనుల్లో వేగం
  • భూములిచ్చిన రైతులే తొలి లబ్ధిదారులు కావాలన్న సీఎం చంద్రబాబు
  • భూములిచ్చిన ఊళ్లోనే రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించాలని ఆదేశం
  • అమరావతిలో రూ. 212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్
  • మూడు నెలల్లో రాజధాని నగరానికి ఓ రూపు తీసుకురావాలని అధికారులకు సూచన
అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించామని, ఈ అభివృద్ధి ఫలాలు మొట్టమొదటగా భూములు త్యాగం చేసిన రైతులకే దక్కాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేయడమే కాకుండా, వారి ఆర్థిక అభివృద్ధికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన 53వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో మొత్తం 18 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అమరావతి అభివృద్ధితో పాటు... రాజధానికి భూములిచ్చిన రైతులు కూడా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను తక్షణం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. 

"రాజధాని రైతులకు కౌలు చెల్లింపుల్లోనూ ఎలాంటి జాప్యం జరగకూడదు. భూములిచ్చిన రైతులకు ఎక్కడ రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని చెప్పామో... అక్కడే ఇవ్వాలి. ఏ ఊళ్లో భూములిచ్చిన వారికి ఆ ఊళ్లోనే ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చాం... అలాగే ఎలాట్మెంట్ చేయాలి. రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెరగాలి. సెక్రటేరీయేట్ టవర్లతో సహా ఇతర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి. వెస్ట్ బైపాస్ రోడ్డును వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. ఏమైనా సాంకేతిక ఇబ్బందులుంటే.. వాటిని వెంటనే పరిష్కరించుకుని  కాజ టోల్ గేట్ దగ్గర జాతీయ రహదారిని చేరేలా ఉన్న రోడ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలి. కరకట్ట రోడ్డును విస్తరించాలి. మూడు నెలల్లో రాజధాని నగరాన్ని ఓ రూపునకు తీసుకురావాలి” అని సీఎం చెప్పారు.

రాజ్ భవన్ సహా వివిధ నిర్మాణలకు ఆమోదం

  • అమరావతిలో గవర్నర్ నివాసం రాజ్ భవన్ నిర్మాణానికి సీఆర్డీఏ ఆమోదించింది. రూ. 212 కోట్ల వ్యయంతో రాజ్ భవన్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. కృష్ణా నదీ ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్ భవన్ నిర్మాణం జరగనుంది. రాజ్ భవన్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ అద్భుతంగా ఉండాలని సీఎం సూచించారు. 
  • మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి 25 శాతం నిధులను సీఆర్డీఏ ఇచ్చేందుకు ఆమోదం లభించింది.
  • రాజధాని ప్రాంతంలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అథారిటీ అంగీకరించింది. 
  • రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులు అథారిటీ ఆమోదించింది. 
  • అమరావతి క్యాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీగా సీఆర్డీఏ వ్యవహరించేలా ఈ సమావేశంలో నిర్ణయించారు. 
  • హ్యాపీ నెస్ట్, ఏపీ ఎన్నార్టీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేసేందుకు అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
  • రాజధానిలో నిర్మించే హోటళ్ల వద్ద పార్కింగ్ నిబంధనల్లోనూ స్వల్ప మార్పులు చేసేందుకు అథారిటీ అంగీకరించింది. 
  • కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8,400 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి నిర్ణయించింది. దీంతో పాటు మరికొన్ని సాంకేతిక అంశాలకు, పరిపాలనా అంశాలకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. 

ఈ సందర్భంగా సీఎం కొన్ని సూచనలు చేశారు. భవిష్యత్తులో వాహనాల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉందని... పార్కింగ్ సమస్య లేకుండా ప్రణాళికలు చేయాలని సూచించారు. అమరావతి రాజధానిలో రోడ్డుపై వాహనాల పార్కింగ్ చేసే పరిస్థితి లేకుండా చూడాలన్నారు. కామన్ పార్కింగ్ ప్రాంతాలు ఉండేలా ప్రణాళికలు చేయాలని సీఎం అధికారులకు చెప్పారు.

విజయవాడ, గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లు, తెనాలి మున్సిపాలిటీ, రాజధాని ప్రాంతంతో ఇంటిగ్రేట్ చేయాలని... బ్లూ గ్రీన్ అమరావతిగా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఆర్డీఏ సమావేశానికి మంత్రి నారాయణ, సీఎస్ కె.విజయానంద్, సీఆర్డీఏ, ఏడీసీ, మౌలికసదుపాయాల కల్పన శాఖ ఉన్నతాధికారులు హజరయ్యారు.

Chandrababu Naidu
Amaravati
CRDA
Andhra Pradesh
Capital City
Farmers
Land Pooling
Infrastructure Development
Real Estate
Returnable Plots

More Telugu News