పాస్‌పోర్ట్ ఇచ్చేయండి... మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట

  • మిథున్ రెడ్డి అమెరికా వెళ్లేందుకు మార్గం సుగమం
  • ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మిథున్ రెడ్డి 
  • సానుకూలంగా తీర్పు ఇచ్చిన ఏసీబీ న్యాయస్థానం
  • లిక్కర్ స్కాంలో అరెస్టయిన మిథున్ రెడ్డి
రాజ్యసభ సభ్యుడు మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో భారీ ఊరట లభించింది. న్యూయార్క్ పర్యటన నిమిత్తం తన పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. కొన్ని షరతులకు లోబడి ఆయన పాస్‌పోర్ట్‌ను తిరిగి జారీ చేయాలని ఆదేశిస్తూ బుధవారం కీలక తీర్పు వెలువరించింది.

ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి అరెస్టయిన సమయంలో మిథున్ రెడ్డి తన పాస్‌పోర్ట్‌ను కోర్టుకు సమర్పించాల్సి వచ్చింది. అప్పటి నుంచి అది కోర్టు ఆధీనంలోనే ఉంది. అయితే, తాను అత్యవసరంగా న్యూయార్క్ వెళ్లాల్సి ఉన్నందున పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇప్పించాలని అభ్యర్థిస్తూ ఆయన ఇటీవల ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, మిథున్ రెడ్డి వాదనలతో ఏకీభవించింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతిస్తూ, పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అయితే, భవిష్యత్తులో విదేశాలకు వెళ్లే ముందు తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలని, దర్యాప్తు సంస్థల విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టమైన షరతులు విధించినట్టు తెలుస్తోంది.

కోర్టు ఆదేశాలతో మిథున్ రెడ్డి తన అమెరికా పర్యటనకు మార్గం సుగమమైంది. త్వరలో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే భారత ప్రతినిధుల బృందంలో మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. 


More Telugu News