'కాంతార' థియేటర్లకి ఇలా రాకండి: రిషబ్ శెట్టి
- 'కాంతార' థియేటర్లకు దైవ వేషధారణలో వెళ్తున్న ఫ్యాన్స్
- థియేటర్లలో అలాంటి వేషధారణ తగదని అభిమానులకు విజ్ఞప్తి
- దైవానికి ఉన్న పవిత్రతను కాపాడాలని సూచన
'కాంతార' సినిమా చూసేందుకు కొందరు ఉత్సాహవంతులైన అభిమానులు, చిత్రంలోని దైవం తరహా వేషధారణతో థియేటర్లకు వస్తున్నారు. ఈ విషయం రిషబ్ శెట్టి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. దైవ వేషధారణ అనేది తమ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదని, దానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని ఆయన గుర్తుచేశారు.
ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ, “దైవ వేషధారణ మన సంప్రదాయంలో చాలా పవిత్రమైన అంశం. దానికి సంబంధించిన భక్తిని, ఆధ్యాత్మికతను మనమందరం గౌరవించాలి. సినిమా థియేటర్లకు దైవ వేషాలతో రావడం ఆ సంప్రదాయాన్ని వక్రీకరించినట్లు అవుతుంది. దయచేసి అలాంటి పనులు చేయకండి. మనం ఆ పుణ్యాన్ని, పవిత్రతను కాపాడుకోవాలి” అని అభిమానులను అభ్యర్థించారు.
'కాంతార' సినిమా కథ కూడా సంప్రదాయాలు, నమ్మకాల చుట్టూనే తిరుగుతుందని, కాబట్టి అభిమానులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని తన విజ్ఞప్తిని గౌరవించాలని ఆయన కోరారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన అభిప్రాయాన్ని పలువురు అభిమానులు, నెటిజన్లు సమర్థిస్తూ, సంప్రదాయాన్ని గౌరవించాలన్న ఆయన ఆలోచనను ప్రశంసిస్తున్నారు.