Kollu Ravindra: వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

Kollu Ravindra Fires on YSRCP Leaders Over Fake Liquor Case
తంబల్లపల్లి కల్తీ మద్యం అంశంపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం
ప్రభుత్వంపై తీవ్ర స్థాయి విమర్శలు చేసిన వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని
నాని విమర్శలపై తీవ్రంగా స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర 
ఆంధ్రప్రదేశ్‌లోని తంబళ్లపల్లి కల్తీ మద్యం కేసుపై అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ అంశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని చేసిన విమర్శలకు మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించారు. మద్యం మాఫియా వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు.

కృష్ణాజిల్లాలో పర్యటించిన సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని మద్యం మాఫియాగా తయారు చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. వైసీపీ పెద్దలకు సౌత్ ఆఫ్రికాలో మద్యం వ్యాపారాలు లేవా అని అడిగారు.

నకిలీ మద్యం కేసు వెనుక ఎంతటివారలున్నా విడిచిపెట్టమని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కల్తీ మద్యం వెనుక ఉన్న మూలాలను అన్నింటినీ బయటకు తీస్తున్నామని తెలిపారు. తంబళ్లపల్లి వద్ద కల్తీ మద్యాన్ని గుర్తించింది తమ ఎక్సైజ్ శాఖ అధికారులేనని మంత్రి కొల్లు అన్నారు.

నిరంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ చేస్తున్నాం కాబట్టే కల్తీ మద్యాన్ని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కేసులో తమ పార్టీకి చెందిన ఇద్దరు ఉన్నట్లు తెలిసిన వెంటనే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసులు నమోదు చేశామని తెలిపారు. కల్తీ మద్యం వెనుక ఉన్న వాస్తవాలు బయటకు తీసేందుకు సమగ్ర విచారణ జరుగుతోందని చెప్పారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు అందిస్తున్నామని వెల్లడించారు. అత్యున్నత ప్రమాణాలతో మద్యాన్ని పరీక్షించిన తర్వాతనే మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 
Kollu Ravindra
Andhra Pradesh
YSRCP
TDP
Fake liquor
Tamballapalle
Perni Nani
Liquor Mafia
Excise Department
South Africa

More Telugu News