YS Sharmila: విజన్ 2047 కాదు... ముందు హాస్టళ్లు బాగుచేయండి: షర్మిల

YS Sharmila demands better hostels not Vision 2047
  • కురుపాం ఘటన నేపథ్యంలో వైఎస్ షర్మిల విమర్శలు
  • సుదూర లక్ష్యాల కన్నా, హాస్టళ్ల తక్షణ సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు
  • 'స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజన్ 2027' ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్
  • రెండేళ్లలో వసతులు కల్పించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరిక
  • కురుపాం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ వేయాలని విజ్ఞప్తి
కురుపాంలోని గిరిజన గురుకులంలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందిన ఘటనప నేపథ్యంలో... కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. 22 ఏళ్ల తర్వాత రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పడం కన్నా, ప్రస్తుతం సంక్షేమ హాస్టళ్లలో గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై తక్షణం దృష్టి సారించాలని ఆమె ప్రభుత్వానికి హితవు పలికారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, "ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులకు 2047 విజన్‌తో ఏం ప్రయోజనం? వారి సమస్యలు పరిష్కరించకుండా సుదూర భవిష్యత్తు గురించి మాట్లాడటం సరికాదు" అని పేర్నొన్నారు. ప్రభుత్వం వెంటనే 'స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజన్ 2027'ను ప్రకటించి, రాబోయే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన మెరుగుపరచాలని ఆమె డిమాండ్ చేశారు.

ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా హాస్టళ్లలో పరిస్థితులను చక్కదిద్దకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని షర్మిల హెచ్చరించారు. ఈ ఆందోళనలో భాగంగా తాము అన్ని సంక్షేమ హాస్టళ్లను సందర్శించి, అక్కడి విద్యార్థులతో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

కురుపాంలో జరిగినటువంటి భాధాకర ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసేందుకు, హాస్టళ్లపై నిరంతర పర్యవేక్షణ కోసం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.
YS Sharmila
Andhra Pradesh
Gurukulam deaths
Kurupam
Tribal students
Hostel conditions
Welfare hostels
Swarnandhra Hostels Vision 2027
AP Congress
Student issues

More Telugu News