Adluri Lakshman: మంత్రి అడ్లూరి వచ్చినప్పుడు నేను అక్కడి నుంచి ఎందుకు వెళ్లిపోయానంటే?: మంత్రి వివేక్ వివరణ

Adluri Lakshman Vivek explains why he left
  • మీనాక్షి నటరాజన్‌తో సమావేశం ఉండటం వల్లే మధ్యలో వెళ్లిపోయానన్న వివేక్
  • హైదరాబాద్‌కు వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానన్న వివేక్
  • తాను వచ్చి కూర్చుంటే వివేక్ వెళ్లిపోయారని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపణ 
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తన పక్క సీటులో కూర్చున్న సమయంలో తాను ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోవలసి వచ్చిందో మంత్రి వివేక్ వివరించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో సమావేశం ఉండటం వల్ల తాను మధ్యలో వెళ్లిపోవలసి వచ్చిందని వివేక్ తెలిపారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో లేనని, తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని ఆయన అన్నారు.

ఇటీవల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, ఒక కార్యక్రమంలో తాను వచ్చి కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోయారని, తాను పక్కన కూర్చుంటే ఆయన ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. మంత్రి వివేక్‌లా తన వద్ద డబ్బులు లేవని ఆయన అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌పై కూడా ఆయన విమర్శలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై వివేక్ స్పందిస్తూ, మీనాక్షి నటరాజన్‌తో సమావేశం ఉండటం వల్లే తాను అక్కడి నుంచి లేచి వచ్చానని, ఈ విషయాన్ని పక్కన ఉన్న మంత్రులకు కూడా తెలియజేశానని అన్నారు. ఎవర్నీ విమర్శించాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి లక్ష్మణ్ తనపై ఎందుకు విమర్శలు చేశారో అర్థం కావడం లేదని అన్నారు. ఆయన మీద తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.

ఏం జరిగింది?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి లక్ష్మణ్ సమయానికి రాలేకపోయారు. దీంతో పొన్నం ప్రభాకర్, వివేక్ చెవిలో అడ్లూరి లక్ష్మణ్ గురించి గుసగుసలాడినట్లుగా వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ దీనిని ఖండించారు. ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్ వచ్చి కూర్చున్న సమయంలో వివేక్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. ఇది వివాదానికి దారితీసింది.
Adluri Lakshman
Telangana Congress
Vivek
Meenakshi Natarajan
Ponnam Prabhakar
Jubilee Hills by election

More Telugu News