ఎయిరిండియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం.. 158 మంది ప్రయాణికులు సురక్షితం!
- కొలంబో నుంచి చెన్నై వస్తున్న ఎయిరిండియా విమానం
- గాల్లో ఉండగా విమానాన్ని ఢీకొట్టిన పక్షి
- చెన్నైలో సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం
వివరాల్లోకి వెళితే, ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 737-800 విమానం (AI-411) మంగళవారం మధ్యాహ్నం కొలంబో నుంచి చెన్నైకి బయలుదేరింది. విమానం చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) పరిధిలోకి ప్రవేశించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రయాణ సమయంలో ఎటువంటి కుదుపులు గానీ, సమస్యలు గానీ తలెత్తకపోవడంతో ప్రయాణికులు దీన్ని గమనించలేదు.
విమానం చెన్నైలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఇంజనీరింగ్ సిబ్బంది సాధారణ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విమానాన్ని పక్షి ఢీకొట్టినట్లు గుర్తించి, స్వల్పంగా సాంకేతిక లోపం తలెత్తినట్లు నిర్ధారించారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా, విమానాన్ని తాత్కాలికంగా నిలిపివేసి (గ్రౌండెడ్) పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు.
ఈ పరిణామంతో చెన్నై నుంచి తిరిగి కొలంబో వెళ్లాల్సిన విమాన సర్వీసును ఎయిరిండియా రద్దు చేసింది. కొలంబో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న 137 మంది ప్రయాణికుల కోసం సంస్థ ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసింది.