Pawan Kalyan: పవన్ కల్యాణ్ సూచన మేరకు ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కమిటీ

Pawan Kalyan Committee for Uppada Fishermen Issues
  • ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతతో ప్రభుత్వ నిర్ణయం
  • కమిటీ ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ
  • కమిటీలో కీలక శాఖల కమిషనర్లు, జిల్లా కలెక్టర్
  • మత్స్యకార ప్రతినిధులకు కూడా కమిటీలో చోటు
  • సీఎం, మంత్రికి ధన్యవాదాలు తెలిపిన పవన్ కల్యాణ్
కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచన మేరకు, ఈ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కమిటీలో పలువురు కీలక అధికారులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. పరిశ్రమల శాఖ, మత్స్యశాఖ కమిషనర్లతో పాటు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ, కాకినాడ జిల్లా కలెక్టర్ ఇందులో ఉంటారు. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన కోసం, మత్స్యకార వర్గం నుంచి జిల్లా కలెక్టర్ నామినేట్ చేసే ప్రతినిధులకు కూడా ఈ కమిటీలో స్థానం కల్పించారు. ఉప్పాడ మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ఈ కమిటీ పనిచేయనుంది.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. మత్స్యకారుల సమస్యలపై తాను చేసిన సూచనకు తక్షణమే స్పందించి కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో ఉప్పాడ మత్స్యకారుల సమస్యలకు త్వరలోనే ఒక పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Pawan Kalyan
Uppada fishermen
Andhra Pradesh
Fisheries department
Chandrababu Naidu
Kakinada district
Acham Naidu
Fishing problems
APPCB
Fishermen issues

More Telugu News