Rajakumari Gania: రౌడీషీటర్‌పై నంద్యాల జిల్లా కలెక్టర్ కొరడా.. జిల్లా బహిష్కరణ

Rajakumari Gania Nandyala Collector Orders Rowdy Sheeter Expulsion
  • ఎస్సీ బాబుకు ఆరు నెలల పాటు జిల్లా బహిష్కరణ
  • ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
  • పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎస్సీ బాబు
నంద్యాల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దిశగా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ కరడుగట్టిన రౌడీషీటర్‌ను ఆరు నెలల పాటు జిల్లా నుంచి బహిష్కరిస్తూ జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్యతో నేరాలకు పాల్పడే వారికి కఠిన సందేశం పంపినట్లయింది.

సంజామల మండలం ఆల్వకొండ గ్రామానికి చెందిన అందనం బాబు అలియాస్ ఎస్సీ బాబు (51)పై పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదై ఉన్నాయి. ఇతను తరచూ నేరాలకు పాల్పడుతూ ఆల్వకొండతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఎస్సీ బాబుపై చర్యలు తీసుకోవాలని పోలీసుల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు కోవెలకుంట్ల సీఐ హనుమంత నాయక్, రౌడీషీటర్ ఎస్సీ బాబును పోలీస్ సర్కిల్ కార్యాలయానికి పిలిపించారు. జిల్లా కలెక్టర్ జారీ చేసిన బహిష్కరణ ఉత్తర్వుల పత్రాన్ని అతనికి అందజేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, ఎస్సీ బాబు ఆరు నెలల కాలం పాటు నంద్యాల జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించకూడదని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ ఆదేశాలను ఉల్లంఘించి జిల్లాలోకి అడుగుపెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా పోలీసులు తేల్చిచెప్పారు. 
Rajakumari Gania
Nandyala district
Rowdy sheeter
District expulsion
Law and order
SC Babu
Kovelakuntla
Andanam Babu
Crime control
Andhra Pradesh police

More Telugu News