Uttar Pradesh: రాత్రికి పాముగా మారుతున్న భార్య.. భర్త ఫిర్యాదుతో అధికారుల షాక్!

UP Man Claims Wife Turns Into A Snake At Night And Bites Him
  • ఉత్తరప్రదేశ్‌లో అధికారులకు అందిన వింత ఫిర్యాదు
  • రాత్రిపూట తన భార్య పాముగా మారుతోందన్న భర్త
  • కాటేసి చంపాలని చూస్తోందని అధికారుల వద్ద ఆవేదన
  • జిల్లా మేజిస్ట్రేట్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన
ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదులు సాధారణంగా కరెంటు, నీళ్లు, రోడ్లు, రేషన్ కార్డుల వంటి సమస్యలపై ఉంటాయి. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు విని అధికారులు నివ్వెరపోయారు. తన భార్య రాత్రిపూట పాముగా మారి తనను కాటు వేయడానికి ప్రయత్నిస్తోందని ఓ భర్త చేసిన ఆరోపణ ఇప్పుడు సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే... మహమూదాబాద్ పరిధిలోని లోధ్సా గ్రామానికి చెందిన మెరాజ్ అనే వ్యక్తి 'సమాధాన్ దివస్' (ప్రజావాణి) కార్యక్రమంలో భాగంగా జిల్లా మేజిస్ట్రేట్‌ను కలిశాడు. "అయ్యా, నా భార్య నసీమున్ రాత్రి అయితే చాలు పాములా మారిపోతోంది. నన్ను కాటు వేయడానికి వెంట పడుతోంది" అని ఫిర్యాదు చేశాడు. తన భార్య వల్ల తనకు ప్రాణహాని ఉందని, ఆమె తనను మానసికంగా తీవ్రంగా హింసిస్తోందని వాపోయాడు.

ఇప్పటికే చాలాసార్లు తనను చంపడానికి ప్రయత్నించిందని, అయితే ప్రతీసారి తాను మెలకువతో ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడ్డానని మెరాజ్ తెలిపాడు. నిద్రలో ఉన్నప్పుడు ఏదో ఒక రాత్రి తనను చంపేయగలదని భయం వ్యక్తం చేశాడు. ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్‌కు లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు సమర్పించాడు. ఈ వింత ఫిర్యాదుతో ఆశ్చర్యపోయిన జిల్లా కలెక్టర్, వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం), పోలీసులను ఆదేశించారు. పోలీసులు దీన్ని మానసిక వేధింపుల కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

ఈ విషయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో వేగంగా వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. "ఆమె ఇంకెంత మందిని కరుస్తోందో ఏమో" అని ఒకరు వ్యాఖ్యానించగా, "ఏమైనా నాగమణి దాచిపెట్టావా?" అని మరొకరు చమత్కరించారు. "నీ పెళ్లి జీవితంలో శ్రీదేవి దొరికింది. చాలా అదృష్టవంతుడివి" అంటూ 1986 నాటి 'నాగిన్' సినిమాలో నటి శ్రీదేవి పోషించిన ఇచ్ఛాధారి పాము పాత్రను గుర్తుచేస్తూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ విచిత్రమైన కేసులో అసలు నిజం ఏంటో తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
Uttar Pradesh
Meraj
Naseemun
snake woman
husband complaint
supernatural claims
mental harassment
Sitapur district
crime news
viral news

More Telugu News