Govindaiah: అంబేద్కర్ విగ్రహం దహనం కేసులో వైసీపీ సర్పంచ్ అరెస్ట్

YSRCP Sarpanch Govindaiah Arrested in Ambedkar Statue Burning Case
  • చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో ఘటన
  • ఘటనను పెద్దది చేసి రాజకీయ రంగు పులిమిన సర్పంచ్
  • పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసిన అసలు నిజాలు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంబేద్కర్ విగ్రహం దహనం ఘటన కేసు అనూహ్య మలుపు తిరిగింది. రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లేందుకు ఓ ప్రజాప్రతినిధే ఈ నాటకానికి సూత్రధారిగా వ్యవహరించారని పోలీసుల దర్యాప్తులో తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి బొమ్మాయపల్లి గ్రామ వైసీపీ సర్పంచ్ గోవిందయ్యను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడే మంగళవారం వెల్లడించారు.

ఘటన వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి అంబేద్కర్ విగ్రహం పాక్షికంగా దగ్ధమైన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే, పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. విగ్రహానికి సమీపంలో ఉన్న ఓ పూరి గుడిసెకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఆ మంటలు ప్రమాదవశాత్తు విగ్రహానికి వ్యాపించాయి. ఈ ప్రమాదాన్ని ఆసరాగా తీసుకున్న సర్పంచ్ గోవిందయ్య, స్థానిక టీడీపీ నాయకులను ఇరికించేందుకు కుట్ర పన్నారు.

గుడిసె యజమానురాలితో కలిసి, ఎవరో ఉద్దేశపూర్వకంగానే అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారంటూ ఓ నాటకాన్ని సృష్టించారు. ఈ ప్రచారం కారణంగా దళిత సంఘాలు, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

విషయంపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని, దానిని గోవిందయ్య రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని నిర్ధారించారు. వివాదాన్ని సృష్టించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలతో గోవిందయ్యను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుషార్ డూడే తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరికొందరిపై కూడా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని, పూర్తి వాస్తవాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. 
Govindaiah
Ambedkar statue
Andhra Pradesh
Chittoor district
YSRCP
TDP
Dalit associations
Political conspiracy
Statue burning
Vedurukuppam

More Telugu News