Mandalapu Ravikumar: ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మందలపు రవికుమార్

Mandalapu Ravikumar Sworn in as AP Science and Technology Academy Chairman
  • మందలపు రవికుమార్‌తో ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి కందుల దుర్గేశ్
  • విజయవాడ హరిత బెరం పార్క్‌లో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహణ 
  • సామాన్యుడి జీవితాల్లో మార్పుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్‌గా మందలపు రవికుమార్‌తో మంత్రి కందుల దుర్గేశ్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్ లో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతామన్నారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తారన్న నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఛైర్మన్‌గా మందలపు రవికుమార్ ను ఎంపిక చేశారని చెబుతూ, ప్రత్యేక అభినందనలు తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీలకు వినియోగిస్తూ, అదే విధంగా సామాన్య ప్రజలకు చేరవేసి తద్వారా శాఖల అభివృద్ధిలో, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలలో భాగస్వామ్యులు కావాలని మందలపు రవికుమార్‌కు సూచించారు.

ప్రమాణ స్వీకారం చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ మందలపు రవి కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు కల్పించిన అవకాశంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్తగా పనిచేశానన్నారు. తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి కందుల దుర్గేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఛైర్మన్‌గా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ (చంటి), గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు, ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, భవన నిర్మాణ, కార్మిక సంఘం అధ్యక్షులు, తాడేపల్లిగూడెం టీడీపీ ఇంచార్జ్ వలవల మల్లికార్జునరావు (బాబ్జి), ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్ మంతెన రామరాజు, పశ్చిమగోదావరి మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ ముళ్లపూడి బాపిరాజు, ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ కోమటి జయరామ్, నాగరాజు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 
Mandalapu Ravikumar
AP Science and Technology Academy
Kandula Durgesh
Andhra Pradesh
Science and Technology
Chandrababu Naidu
AP Government
Technology Development
Vijayawada
Telugu News

More Telugu News