Mohammed Siraj: ఒక మ్యాచ్‌తో హీరో.. మరో మ్యాచ్‌తో జీరోనా?: ట్రోలింగ్‌పై సిరాజ్ ఆవేదన

Mohammed Siraj Distressed by Trolling After Match Performance
  • సోషల్ మీడియా ట్రోలింగ్‌పై స్పందించిన టీమిండియా పేసర్ సిరాజ్
  • ఒక మ్యాచ్ సరిగ్గా ఆడకపోతే ఆటో నడుపుకోమంటూ విమర్శిస్తున్నార‌న్న బౌల‌ర్‌
  • రాత్రికి రాత్రే హీరో నుంచి జీరో ఎలా చేస్తారని ఆవేదన
  • బయటివారి అభిప్రాయాలు తనకు అవసరం లేదని స్పష్టీక‌ర‌ణ‌
  • ఇంగ్లాండ్ సిరీస్‌లో 23 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసిన సిరాజ్
  • కుటుంబం, సహచరుల మాటలకే విలువ ఇస్తానన్న హైదరాబాదీ బౌలర్
టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ సోషల్ మీడియా ట్రోలింగ్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అభిమానుల తీరు తనను ఎంతగానో బాధిస్తుందని, ఒక మ్యాచ్‌లో అద్భుతంగా ఆడితే ఆకాశానికెత్తే జనం, ఆ తర్వాతి మ్యాచ్‌లో విఫలమైతే దారుణంగా విమర్శిస్తున్నారని వాపోయాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సిరాజ్, క్రీడాకారుల మానసిక స్థితిపై ట్రోలింగ్ చూపే ప్రభావం గురించి మాట్లాడాడు.

"మీరు బాగా ఆడినప్పుడు ప్రపంచమంతా మిమ్మల్ని పొగుడుతుంది. 'సిరాజ్ లాంటి బౌలర్ ప్రపంచంలోనే లేడు' అంటారు. కానీ అదే బౌలర్, ఆ తర్వాతి మ్యాచ్‌లో విఫలమైతే చాలు.. 'ఏం బౌలర్ వీడు? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? వెళ్లి ఆటో నడుపుకో పో' అంటూ దారుణంగా మాట్లాడతారు. ఇలా అనడంలో అర్థం ఏముంది?" అని సిరాజ్ ప్రశ్నించాడు. ఒకే ఒక్క మ్యాచ్‌తో ఆటగాడిని హీరో నుంచి జీరోగా ఎలా మార్చేస్తారని ఆవేదన వ్య‌క్తం చేశాడు.

దివంగత తండ్రి ఆటో రిక్షా డ్రైవర్ కావడం, హైదరాబాద్‌లోని ఓ సాధారణ కుటుంబం నుంచి తాను ఎదిగివచ్చిన విషయాన్ని సిరాజ్ గుర్తుచేసుకున్నాడు. ఇలాంటి నేపథ్యంలో తన నేపథ్యాన్ని కించపరిచేలా విమర్శలు చేయడం సరికాదన్నాడు. "ఇలాంటి వ్యాఖ్యలు విన్న తర్వాత, బయటి వారి అభిప్రాయాలు నాకు అవసరం లేదని నిర్ణయించుకున్నాను. నా కుటుంబం, నా సహచర ఆటగాళ్లు నా గురించి ఏమనుకుంటున్నారన్నదే నాకు ముఖ్యం" అని సిరాజ్ స్పష్టం చేశాడు.

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ అద్భుతంగా రాణించిన విష‌యం తెలిసిందే. ఐదు టెస్టుల్లో ఏకంగా 23 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో కపిల్ దేవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజాల సరసన చేరాడు. 31 ఏళ్ల సిరాజ్ ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో ఉన్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులోనూ ఏడు వికెట్లు తీసి జట్టు విజయంలో పాలుపంచుకున్నాడు.
Mohammed Siraj
Siraj
Indian Cricket
Cricket Troll
Cricket Trolling
Hyderabad bowler
India vs England
Test Series
ICC Test Rankings
Jasprit Bumrah

More Telugu News