US Green Card: అమెరికా గ్రీన్ కార్డ్ కావాలా?.. పెట్టుబడితో సులువైన మార్గం ఇదే!

US Green Card Investment Opportunity with EB 5 Visa
  • అమెరికా గ్రీన్ కార్డ్‌కు ఈబీ-5 వీసా ఉత్తమ మార్గమని నిపుణుల వెల్లడి
  • హైదరాబాద్‌లోని ఎఫ్‌టీసీసీఐలో న్యూయార్క్ ఇమ్మిగ్రేషన్ ఫండ్ అవగాహన సదస్సు
  • కనీసం 8 లక్షల డాలర్ల పెట్టుబడితో గ్రీన్ కార్డ్‌కు అవకాశం
  • లేదా 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించినా సరిపోతుంది
  • ట్రంప్ హయాంలో వీసా నిబంధనలు కఠినమవడంతో ఈబీ-5 వైపు భారతీయుల చూపు
  • అర్హులకు మొదట రెండేళ్ల షరతులతో కూడిన గ్రీన్ కార్డ్ జారీ
అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలనుకునే వారికి ఈబీ-5 (EB-5) వీసా అత్యుత్తమ మార్గమని అమెరికాకు చెందిన ప్రముఖ ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఇల్యా ఫిష్కిన్‌ పేర్కొన్నారు. పెట్టుబడుల ద్వారా గ్రీన్ కార్డ్ పొందే ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు న్యూయార్క్ ఇమ్మిగ్రేషన్ ఫండ్ సంస్థ హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించింది. తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ఆసక్తిగల వారు హాజరయ్యారు.

ఈ సమావేశంలో ఇల్యా ఫిష్కిన్‌తో పాటు ఈబీ-5 ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ భాగస్వాములు సుబ్బరాజు పేరిచర్ల, సంపన్‌ మల్హోత్రా పాల్గొన్నారు. ట్రంప్ హయాంలో వీసా నిబంధనలు కఠినతరం కావడంతో చాలామంది భారతీయులు ఇప్పుడు ఈబీ-5 వీసా పథకం వైపు మొగ్గు చూపుతున్నారని వారు తెలిపారు. అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే వారికి ఈ పథకం ఎంతగానో సహాయపడుతుందని వివరించారు.

ఈబీ-5 వీసా పొందడానికి ఉన్న అర్హతలు, నిబంధనలను సుబ్బరాజు, సంపన్‌ మల్హోత్రా స్పష్టంగా వివరించారు. దీనికోసం దరఖాస్తుదారులు ముందుగా ఫార్మ్ ఐ-526 పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. అమెరికా ప్రభుత్వం గుర్తించిన 'టార్గెటెడ్ ఎంప్లాయ్‌మెంట్ ఏరియా'లో కనీసం 8 లక్షల డాలర్లు (సుమారు రూ. 6.7 కోట్లు) పెట్టుబడిగా పెట్టాలి. ఇతర ప్రాంతాల్లో అయితే ఈ పెట్టుబడి 10.50 లక్షల డాలర్లుగా (సుమారు రూ. 8.7 కోట్లు) ఉంటుందని తెలిపారు. ఇది వీలుకాని పక్షంలో, కనీసం 10 మంది అమెరికన్లకు పూర్తిస్థాయి ఉద్యోగాలు కల్పించేలా ఒక సంస్థను ఏర్పాటు చేసినా అర్హత లభిస్తుందని వారు పేర్కొన్నారు.

అర్హత సాధించిన వారికి తొలుత రెండేళ్ల కాలానికి షరతులతో కూడిన గ్రీన్ కార్డ్ జారీ చేస్తారని, ఆ తర్వాత ఐ-829 ఫార్మ్ ద్వారా శాశ్వత గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వారు వివరించారు.
US Green Card
Ilya Fishkin
EB-5 Visa
Immigration
Investment Visa
Subbaraju Pericherla
Sampan Malhotra
America
New York Immigration Fund
Telangana Chamber of Commerce

More Telugu News