11 రోజుల్లో ఓజీ ఎంత వసూలు చేసిందంటే...!

  • 11 రోజుల్లో రూ.308 కోట్లు వసూళ్లు చేసిన ఓజీ
  • 2025లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచిన ఓజీ
  • ఓజీ ప్రీక్వెల్, సీక్వెల్ కన్‌ఫర్మ్ చేసిన సుజీత్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ (OG) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం, మొదటి రోజు నుంచే తన స్థాయిని చాటింది. విడుదలైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.308 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తూ 2025లో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రంగా నిలిచింది.

“రూల్స్ లేవు, చట్టాలు లేవు...గంభీర 'లా' మాత్రమే ఉంది!” ఇతడే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ 'ఎక్స్' ద్వారా సినిమా వసూళ్ల వివరాలు ప్రకటించింది.

విడుదలైన రోజు రూ.154 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఇది పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే ఓ రికార్డు. ఇప్పటి వరకు ఈ ఏడాది టాప్ గ్రాసర్‌గా నిలిచిన వెంకటేశ్ – అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' రూ.300 కోట్ల మార్క్‌ను పూర్తిస్థాయిలో అందుకోగా, ఓజీ ఆ రికార్డును కేవలం 11 రోజుల్లోనే అధిగమించింది.

వీరాభిమాని దర్శకుడై సినిమా చేస్తే ఎలా ఉంటుందో సుజీత్ ఓజీతో చూపించారు. ఓజస్ గంభీరగా పవన్‌ను తెరపై స్టైలిష్‌గా ఆవిష్కరించారు.

ఈ సినిమా, దాని విజయం కేవలం ట్రైలర్ లాంటివన్న సుజీత్.. భవిష్యత్తులో దీనికి రెట్టింపు సందడి ఉంటుందంటూ ప్రీక్వెల్, సీక్వెల్‌ని ఖరారు చేశారు. ఇప్పటికే 'ఓజీ' ప్రీక్వెల్, సీక్వెల్‌లపై పని మొదలుపెట్టినట్టు సుజీత్ వెల్లడించారు. ప్రీక్వెల్‌లో పవన్‌ కుమారుడు అకీరా నందన్ కనిపించనున్నాడా అనే ప్రశ్నపై ఆయన, “ఇప్పుడే చెబితే థ్రిల్ ఉండదు” అంటూ ఆసక్తిని రేకెత్తించారు. 


More Telugu News