బీహార్ పీఠం కోసం ఉత్కంఠ పోరు.. ముగ్గురు ప్రముఖులకు అసలు సిసలు పరీక్ష

  • బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి
  • నితీశ్, తేజస్వి, ప్రశాంత్ కిశోర్‌లకు అగ్నిపరీక్ష
  • మరోసారి సీఎంగా నితీశ్ రికార్డు సృష్టిస్తారా?
  • ఒంటరి పోరాటం చేస్తున్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్
  • తొలిసారి ఎన్నికల బరిలో ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ పార్టీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేళ, ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికలు ముగ్గురు కీలక నేతల రాజకీయ భవిష్యత్తుకు అసలైన అగ్నిపరీక్షగా నిలవనున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, రాజకీయ వ్యూహకర్త నుంచి నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్.. ఈ ముగ్గురి భవితవ్యాన్ని ఈ ఎన్నికల ఫలితాలు నిర్దేశించనున్నాయి. వీరి గెలుపోటములు బీహార్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలకనున్నాయి.

నితీశ్ కుమార్: నిలుస్తారా.. నిష్క్రమిస్తారా?
దాదాపు రెండు దశాబ్దాలుగా బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న 74 ఏళ్ల నితీశ్ కుమార్‌కు ఈ ఎన్నికలు అత్యంత కీలకం. ఒకప్పుడు 'సుశాసన్ బాబు'గా సుపరిపాలనకు పేరుగాంచిన ఆయన, ఇటీవలి కాలంలో పాలన కంటే రాజకీయంగా పొత్తులు మార్చడం వల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. దీనికి తోడు ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి. జేడీయూ-బీజేపీ కూటమికి ఆయనే సారథ్యం వహిస్తున్నప్పటికీ, మళ్లీ ఆయనే సీఎం అభ్యర్థిగా ఉంటారా అనే చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచి రికార్డు స్థాయిలో పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారా? లేక ఆయన రాజకీయ శకం ముగిసిపోతుందా? అనేది తేలాల్సి ఉంది.

తేజస్వి యాదవ్: యువనేత పోరాటం ఫలించేనా?
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, 35 ఏళ్ల తేజస్వి యాదవ్ ఈ ఎన్నికల్లో గట్టి సవాలును ఎదుర్కొంటున్నారు. తండ్రి అనారోగ్యంతో ఉండటంతో పార్టీ బాధ్యతలను పూర్తిగా తన భుజాలపై వేసుకున్నారు. 2020 ఎన్నికల్లో 75 సీట్లతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించినా, కాంగ్రెస్ వైఫల్యం కారణంగా అధికారానికి దూరమైంది. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నారు. రాహుల్ గాంధీ యాత్రతో పాటు సొంతంగా 'బీహార్ అధికార్ యాత్ర' చేపట్టి ప్రజల్లోకి వెళ్లారు. బీజేపీ-జేడీయూ కూటమి బలమైన ఎన్నికల యంత్రాంగాన్ని ఎదుర్కొని ఆయన ఎంతవరకు విజయం సాధిస్తారో చూడాలి.

ప్రశాంత్ కిశోర్: వ్యూహకర్తగా సక్సెస్.. నేతగా నెగ్గుతారా?
ఎన్నికల వ్యూహకర్తగా ఎందరో నేతలను గెలిపించిన ప్రశాంత్ కిశోర్, ఇప్పుడు తానే స్వయంగా రాజకీయ బరిలోకి దిగుతున్నారు. గతేడాది ఆయన స్థాపించిన 'జన్ సురాజ్' పార్టీ ఈ ఎన్నికలతో అరంగేట్రం చేయనుంది. 2022లో రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ యాత్ర చేసిన పీకే, తనకు ప్రజల్లో గణనీయమైన మద్దతు ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రధాన పార్టీల నేతలు ఆయనను తేలిగ్గా తీసిపారేస్తున్నారు. సోషల్ మీడియాలో భారీ ప్రచారంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ, ఈ ప్రచారం ఓట్ల రూపంలోకి మారుతుందా? లేదా? అన్నది ఫలితాల తర్వాతే తెలుస్తుంది. 


More Telugu News