Rakesh Eahagabhan: పలకరించిన పాపానికి ప్రాణాలు తీశాడు... అమెరికాలో భారతీయుడిపై కాల్పులు

Rakesh Eahagabhan Shot Dead in Pennsylvania Motel
  • అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణ హత్య
  • మోటెల్ యజమాని రాకేష్ ఏహాగబన్‌ను కాల్చి చంపిన దుండగుడు
  • గొడవ గురించి అడిగేందుకు వెళ్లగా తలపై అతి దగ్గరి నుంచి కాల్పులు
  • హత్యకు ముందు తన సహచరిపై కూడా కాల్పులు జరిపిన నిందితుడు
  • పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితుడికి గాయాలు, అరెస్ట్
అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్‌బర్గ్‌లో గొడవను ఆపేందుకు ప్రయత్నించిన మోటెల్ యజమానిని ఓ దుండగుడు అతి సమీపం నుంచి కాల్చి చంపాడు. ఈ ఘటన గత శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

రాబిన్సన్ టౌన్‌షిప్‌లోని ‘పిట్స్‌బర్గ్ మోటెల్’ మేనేజర్‌గా పనిచేస్తున్న రాకేష్ ఏహాగబన్ (51) తన మోటెల్ బయట గొడవ జరుగుతుండటంతో పరిస్థితిని తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్న నిందితుడు స్టాన్లీ యూజీన్ వెస్ట్ (37)ను సమీపించి, ‘అంతా బాగానే ఉందా మిత్రమా?’ అని పలకరించారు. ఆ మాట పూర్తికాకముందే, వెస్ట్ తన వద్ద ఉన్న తుపాకీతో రాకేష్ తలపై అతి దగ్గరి నుంచి కాల్పులు జరిపాడు. దీంతో రాకేష్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఈ దారుణ దృశ్యాలు మోటెల్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయని స్థానిక పోలీసులు తెలిపారు.

రాకేష్‌పై కాల్పులు జరపడానికి కొద్ది నిమిషాల ముందు, నిందితుడు వెస్ట్ తన సహచరిగా భావిస్తున్న మహిళపై కూడా మోటెల్ పార్కింగ్ స్థలంలో కాల్పులకు తెగబడ్డాడు. కారులో ఉన్న ఆమె మెడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆ సమయంలో కారు వెనుక సీట్లో ఓ చిన్నారి కూడా ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తు ఆ చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు. తీవ్రంగా గాయపడిన మహిళ, కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి సమీపంలోని ఓ ఆటో సర్వీస్ సెంటర్‌ వారి సహాయం కోరింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

రాకేష్‌ను హత్య చేసిన తర్వాత నిందితుడు వెస్ట్ అక్కడి నుంచి ఓ వ్యాన్‌లో నింపాదిగా వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని పిట్స్‌బర్గ్‌లోని ఈస్ట్ హిల్స్ ప్రాంతంలో గుర్తించారు. పోలీసులను చూసి నిందితుడు కాల్పులు జరపగా, ఈ క్రమంలో ఓ డిటెక్టివ్ గాయపడ్డాడు. పోలీసుల ఎదురుకాల్పుల్లో నిందితుడు కూడా గాయపడటంతో, అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై హత్య, హత్యా యత్నం, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించడం వంటి అభియోగాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ దారుణానికి పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వారు పేర్కొన్నారు.
Rakesh Eahagabhan
Pittsburgh
Pennsylvania
Indian American
Shooting
Murder
Stanley Eugene West
Crime
East Hills
Motel

More Telugu News