మహిళల వరల్డ్ కప్: ఆల్ రౌండ్ షోతో పాకిస్థాన్ ను మట్టికరిపించిన భారత్

  • మహిళల ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం
  • 88 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన టీమిండియా
  • భారత్ తరఫున హర్లీన్ డియోల్ టాప్ స్కోరర్
  • మూడేసి వికెట్లతో చెలరేగిన క్రాంతి గౌడ్, దీప్తి శర్మ
  • పాక్ బ్యాటర్ సిద్రా అమీన్ ఒంటరి పోరాటం వృథా
అది పురుషుల క్రికెట్ అయినా, మహిళల క్రికెట్ అయినా... వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్జాన్ చేతిలో ఇప్పటివరకు భారత్ ఓడింది లేదు. ఇప్పుడు కూడా అదే ఆనవాయతీ కొనసాగింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ 2025లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో టీమిండియా 88 పరుగుల భారీ తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 248 పరుగుల లక్ష్యఛేదనలో పాక్ చేతులెత్తేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన (23), ప్రతిక రావల్ (31) శుభారంభం అందించారు. ఆ తర్వాత హర్లీన్ డియోల్ (46) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. జెమీమా రోడ్రిగ్స్ (32), దీప్తి శర్మ (25) కూడా రాణించారు. అయితే, చివర్లో వికెట్ కీపర్ రిచా ఘోష్ కేవలం 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో భారత స్కోరు 247 పరుగులకు చేరింది. పాక్ బౌలర్లలో డయానా బేగ్ 4 వికెట్లు పడగొట్టింది.

అనంతరం 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను భారత బౌలర్లు కట్టుదిట్టంగా కట్టడి చేశారు. పాక్ బ్యాటర్లలో సిద్రా అమీన్ (81) ఒంటరి పోరాటం చేసినా, ఇతర బ్యాటర్ల నుంచి ఆమెకు ఏమాత్రం సహకారం అందలేదు. నటాలియా పర్వైజ్ (33) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరో 3 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించారు. స్నేహ్ రాణాకు 2 వికెట్లు దక్కాయి. దీంతో పాకిస్థాన్ జట్టు 43 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో ప్రపంచకప్‌లో భారత్ తన ప్రస్థానాన్ని ఘనంగా కొనసాగిస్తోంది.


More Telugu News