Richa Ghosh: మహిళల వరల్డ్ కప్: పాక్‌కు 248 పరుగుల టార్గెట్ నిర్దేశించిన భారత్

India sets 248 run target for Pakistan in Womens World Cup
  • మహిళల ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ పోరు
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
  • 50 ఓవర్లలో 247 పరుగులకు టీమిండియా ఆలౌట్
  • 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన హర్లీన్ దీల్
  • కేవలం 20 బంతుల్లో 35 పరుగులు చేసిన రిచా ఘోష్
  • నాలుగు వికెట్లతో చెలరేగిన పాక్ బౌలర్ డయానా బేగ్
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ 2025లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత జట్టు పోరాడే స్కోరు సాధించింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. చివర్లో వికెట్ కీపర్ రిచా ఘోష్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడంలో కీలకపాత్ర పోషించింది.

ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చాలామంది మంచి ఆరంభాలనే అందుకున్నా, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. హర్లీన్ దీల్ 65 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఓపెనర్లు ప్రతిక రావల్ (31), స్మృతి మంధాన (23)తో పాటు, జెమీమా రోడ్రిగ్స్ (32), దీప్తి శర్మ (25) కూడా రాణించారు. అయితే, పాక్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో భారత స్కోరు వేగం మందగించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (19) కూడా నిరాశపరిచింది.

ఒక దశలో 220 పరుగులకే పరిమితం అవుతుందని భావిస్తున్న సమయంలో, రిచా ఘోష్ బ్యాట్‌తో చెలరేగింది. కేవలం 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమె దూకుడైన ఆటతో భారత స్కోరు 240 పరుగులు దాటింది.

పాకిస్థాన్ బౌలర్లలో పేసర్ డయానా బేగ్ 4 వికెట్లతో భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీసింది. కెప్టెన్ ఫాతిమా సనా, సాదియా ఇక్బాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, నష్రా సంధు, రమీన్ షమీమ్‌లకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే పాకిస్థాన్ 248 పరుగులు చేయాల్సి ఉంది.
Richa Ghosh
India Women
Pakistan Women
ICC Womens World Cup 2025
Harleen Deol
Smriti Mandhana
Diana Baig
womens cricket
cricket score
womens world cup

More Telugu News