Rajinikanth: ఆధ్యాత్మిక యాత్రలో రజనీకాంత్... ప్రశాంతత కోసం మళ్లీ హిమాలయాలకు!

Rajinikanth on Spiritual Journey to Himalayas for Peace
  • జైలర్ 2' షూటింగ్‌కు ముందు వారం రోజుల విరామం
  • రిషికేశ్, బద్రీనాథ్‌తో పాటు మహావతార్ బాబాజీ గుహ సందర్శన
  • ప్రతి ఏటా ఇక్కడికి రావడం తన ఆనవాయితీ అని వెల్లడి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రజినీ యాత్ర ఫొటోలు
ఒక భారీ చిత్రం షూటింగ్ పూర్తిచేసి, మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును మొదలుపెట్టే ముందు మానసిక ప్రశాంతత కోసం సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటారని తెలిసిందే. తన ఆనవాయతీని కొనసాగిస్తూ ఆయన మరోసారి హిమాలయ యాత్ర చేపట్టారు. 'కూలీ' చిత్రం చిత్రీకరణను ఇటీవల ముగించుకున్న ఆయన, 'జైలర్ 2' షూటింగ్ ప్రారంభానికి ముందు వారం రోజుల పాటు హిమాలయాల్లో గడపనున్నారు.

ఈ యాత్రలో భాగంగా రజినీకాంత్ రిషికేశ్‌లోని ఆశ్రమంలో బస చేస్తూ బద్రీనాథ్, మహావతార్ బాబాజీ గుహ వంటి పవిత్ర స్థలాలను దర్శించుకున్నారు. హిమాలయాల ప్రకృతి సౌందర్యం నడుమ ఆయన ధ్యానంలో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎంతో సింపుల్ గా ఉన్న రజనీ... రోడ్డు పక్కన అల్పాహారం తీసుకుంటూ కనిపించారు.

ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ, "ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం వల్ల ఒక కొత్త అనుభవం లభిస్తుంది. ప్రపంచమంతటికీ ఆధ్యాత్మికత చాలా అవసరం. అదే మనిషికి తృప్తిని, ప్రశాంతతను ఇస్తుంది" అని పేర్కొన్నారు. భగవంతుడిపై విశ్వాసం జీవితంలో సమతుల్యతను అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నటించిన 'కూలీ' సినిమా తర్వాత రజినీ, 'జైలర్'కు దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్‌కుమార్‌తో 'జైలర్ 2' చేయనున్నారు. ఈ విరామంలో శారీరకంగా, మానసికంగా నూతన శక్తి పొందడానికే ఆయన ఈ యాత్రను ఎంచుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మహావతార్ బాబాజీని రజినీకాంత్ ఎంతగానో ఆరాధిస్తారన్న విషయం తెలిసిందే. ఆయన ప్రేరణతోనే 'బాబా' సినిమా తీశారు. ఈసారి కూడా బాబాజీ గుహలో కొంత సమయం ధ్యానం చేసి ఆధ్యాత్మిక శాంతిని పొందారని ఆయన సన్నిహితులు తెలిపారు.

యాత్ర ముగించుకుని చెన్నైకి తిరిగి వచ్చిన తర్వాత రజినీకాంత్ 'జైలర్ 2' చిత్రీకరణలో పాల్గొంటారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్‌ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 
Rajinikanth
Rajinikanth spiritual journey
Himalayas
Jailer 2
Coolie movie
Lokesh Kanagaraj
Nelson Dilipkumar
Mahavatar Babaji
Rishikesh
Badrinath

More Telugu News