Harish Rao: మోదీ, రేవంత్.. 'బడే భాయ్, చోటా భాయ్': హరీశ్ రావు

Harish Rao slams Modi Revanth as Bade Bhai Chota Bhai
  • తెలంగాణను మోసం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శ
  • కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచెయ్యి చూపారని ఆరోపణ
  • తెలంగాణకు బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామరక్ష అని స్పష్టం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ 'బడే భాయ్, చోటా భాయ్' అని, తెలంగాణ ప్రజలను మోసం చేయడంలో వారిద్దరిదీ ఒకే తీరని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరిది మోసపు చరిత్ర అయితే, మరొకరిది ద్రోహపు చరిత్ర అని, ఈ రెండు పార్టీలు తెలంగాణ పాలిట శత్రువులని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.

జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, "కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపించినందుకు కృతజ్ఞత కూడా చూపలేదు. నల్లధనం తెచ్చి రూ.15 లక్షలు ఇస్తామన్న హామీ, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మాట ఏమైంది?" అని హరీశ్ రావు ప్రశ్నించారు. రూ.350 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.1200కు, రూ.65 ఉన్న పెట్రోల్‌ను రూ.100కు పెంచింది బీజేపీ కాదా? అని నిలదీశారు. ఎన్నికలు రాగానే ధరలు తగ్గించినట్లు డ్రామాలు ఆడి, ఎన్నికలు ముగియగానే మళ్లీ పెంచి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

మరోవైపు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపైనా హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. "నమ్మి ఓటేసిన ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి నట్టేట ముంచుతున్నారు. కేసీఆర్ హయాంలో ఎన్నడూ లేనివిధంగా రైతులు నేడు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియాను సకాలంలో అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది" అని దుయ్యబట్టారు. తెలంగాణ రైతులంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్నచూపని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా పరిషత్‌తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కష్టకాలంలో తెలంగాణకు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే శ్రీరామరక్ష అని ఆయన స్పష్టం చేశారు. 
Harish Rao
Revanth Reddy
Narendra Modi
Telangana politics
Congress Party
BJP
BRS party
Telangana Budget
Fertilizer crisis
Local body elections

More Telugu News