Yashwanth Reddy: తల్లి మందలించిందని ఘాతుకం.. కిరాతకంగా చంపేసిన బీటెక్ కుమారుడు

Proddutur Son Kills Teacher Mother After Argument Yashwanth Reddy Arrested
  • ప్రొద్దుటూరులో తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసిన కుమారుడు
  • హత్య సమయంలో తండ్రిని గదిలో బంధించిన యశ్వంత్ రెడ్డి
  • మృతురాలు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, నిందితుడు బీటెక్ గ్రాడ్యుయేట్
  • నిందితుడికి మానసిక సమస్యలు ఉన్నాయని పోలీసుల అనుమానం
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకే కాలయముడై తల్లిని కిరాతకంగా హత్య చేశాడు. తల్లి మందలించిందన్న ఆగ్రహంతో విచక్షణ కోల్పోయి కత్తితో గొంతు కోసి హతమార్చాడు. పట్టణంలోని శ్రీరామ్ నగర్‌లో ఈ ఉదయం జరిగిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు కథనం ప్రకారం శ్రీరామ్ నగర్‌కు చెందిన యశ్వంత్ రెడ్డికి, అతడి తల్లి లక్ష్మీదేవికి మధ్య ఇంట్లో వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన యశ్వంత్ వంటగదిలో ఉన్న కత్తితో తల్లిపై దాడి చేసి ఆమె గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా, రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను ఇంటి బయటకు ఈడ్చుకొచ్చి పడేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడే సమయంలో తన తండ్రిని మరో గదిలో బంధించడం గమనార్హం.

మృతురాలు లక్ష్మీదేవి స్థానిక ఈశ్వర్‌రెడ్డి నగర్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. నిందితుడు యశ్వంత్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు యశ్వంత్ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఉన్నత చదువులు చదివిన కొడుకే తల్లి పాలిట యముడిగా మారడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Yashwanth Reddy
Kadapa district
Proddutur
mother murder
crime news
B.Tech graduate
Lakshmi Devi
teacher murder
Andhra Pradesh crime
mental health

More Telugu News