Nirmala Sitharaman: బ్యాంకుల వద్ద రూ. 1.82 లక్షల కోట్ల అన్ క్లెయిమ్డ్ ఆస్తులు.. మీ సొమ్ము మీరు తీసుకోండి: ప్రజలకు నిర్మలా సీతారామన్ సూచన

Nirmala Sitharaman urges public to claim unclaimed assets worth 182 lakh crore
  • 'మీ సొమ్ము - మీ హక్కు' పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్
  • ప్రజలు సరైన పత్రాలతో వచ్చి తమ సొమ్ము తీసుకోవాలని సూచన
  • పౌరులకు అధికారులు అవగాహన కల్పించాలన్న నిర్మలా సీతారామన్
బ్యాంకులు, నియంత్రణ సంస్థల వద్ద రూ. 1.82 లక్షల కోట్ల విలువైన ఆర్థిక వనరులు ఎటువంటి క్లెయిమ్ చేయబడకుండా నిలిచిపోయాయని, ఆయా సంస్థలు వాటిని అర్హులకు చేరేలా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు సూచించారు. గుజరాత్ గాంధీనగర్‌లో మూడు నెలల పాటు జరగనున్న 'మీ సొమ్ము - మీ హక్కు' అనే కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ, అవగాహన, ప్రచారం, కార్యాచరణ అనే మూడు అంశాలపై దృష్టి సారించాలని కోరారు.

సదరు నిధులకు సంబంధించిన క్లెయిమ్‌లు పరిష్కరించబడని కారణంగా, అవి సరైన లబ్ధిదారులకు చేరకుండా ఉన్నాయని ఆమె తెలిపారు. బ్యాంకు డిపాజిట్లు, బీమా, ప్రావిడెండ్‌ ఫండ్‌, షేర్లు మొదలైన రూపాల్లో ఈ నిధులు బ్యాంకులు, ఇతర నియంత్రణ సంస్థల వద్ద ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రజలు అవసరమైన పత్రాలతో వచ్చి తమ సొమ్మును తిరిగి పొందాలని ఆమె సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం కేవలం సంరక్షకుడి పాత్ర పోషిస్తుందని ఆమె స్పష్టం చేశారు.

ఎవరూ క్లెయిమ్‌ చేయని నగదు దీర్ఘకాలంలో ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు బదిలీ అవుతూ ఉంటుందని నిర్మలా సీతారామన్ వివరించారు. బ్యాంకుల నుంచి ఆర్బీఐకి, సెబీ నుంచి మరో సంస్థకు ఇలా నగదు మారుతుందని ఆమె తెలిపారు. క్లెయిమ్ చేసుకోని ఆర్థిక వనరుల కోసం ప్రభుత్వం 'ఉద్గమ్' పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిందని, దీని ద్వారా పౌరులు తమ సొమ్మును క్లెయిమ్‌ చేసుకోవచ్చని ఆమె తెలియజేశారు.

పౌరులు తమ సొమ్మును క్లెయిమ్ చేసుకునేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులపై ఉందని నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. అవసరమైతే బ్యాంకులు గ్రామాల్లో ప్రత్యేక స్టాల్స్‌‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. క్లెయిమ్ చేయని మొత్తాన్ని అర్హులకు చేరేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు.
Nirmala Sitharaman
unclaimed assets
unclaimed funds
UDGAM portal
RBI
banks
financial resources

More Telugu News