Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం 'ఆటోడ్రైవర్ల సేవలో'... హైలైట్స్ ఇవిగో!

Chandrababu Naidu Launches Auto Drivers Welfare Scheme in Vijayawada
  • ఆటోడ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం
  • విజయవాడలో ప్రారంభం
  • ఆటోల్లో వచ్చిన నేతలు
రాష్ట్రంలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లకు అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం 'ఆటో డ్రైవర్ల సేవలో...' పథకం ప్రారంభోత్సవాన్ని శనివారం విజయవాడలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పలు కీలక ప్రకటనలు చేశారు. కార్యక్రమం ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

  • సీఎం చంద్రబాబు తన నివాసం నుంచి సభా ప్రాంగణం వరకు ఆటోలో ప్రయాణించారు. సుమారు 14 కిలోమీటర్ల దూరం సీఎం ఆటోలో ప్రయాణించారు. 
  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ కూడా వేర్వేరుగా ఆటోల్లో ప్రయాణించి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 
  • ఆటో డ్రైవర్ సేవలో పథకం లబ్దిదారుల కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, మాధవ్ ఆటోల్లో ప్రయాణించారు. వారి కుటుంబ స్థితిగతులను నేతలు అడిగి తెలుసుకున్నారు. 
  • ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నామని సీఎం అడిగిన ఓ ప్రశ్నకు ఆటో డ్రైవర్ అఫ్సర్ ఖాన్ సమాధానమిచ్చారు. ఆటో ద్వారా ప్రజలను, ప్రయాణికుల్ని గమ్య స్థానాలకు చేరుస్తూ చేస్తున్న సేవ అభినందనీయమని సీఎం బదులిచ్చారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని సీఎం హామీ ఇచ్చారు. 
  • తల్లికి వందనం, దీపం-2.0 వంటి పథకాలు అందాయా..., రేషన్ ద్వారా బియ్యం తీసుకుంటున్నారా అని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. అలాగే పిల్లలను చక్కగా చదివించుకోవాలని... పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంచేలా చూడాలని ఆటో డ్రైవర్ అఫ్సర్ ఖాన్ దంపతులకు సీఎం సూచించారు.
  • ఆటోల్లో వెళుతున్న చంద్రబాబును, ఇతర నేతలను చూసి ప్రజలు సంతోషంతో కేరింతలు కొట్టారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ నేతలు ముందుకు కదిలారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కాళేశ్వరరావు మార్కెట్, ఏలూరు లాకులు, ముత్యాలంపాడు గవర్నమెంటు ప్రెస్ మీదుగా సీఎం సహా ఇతర నేతలు ఆటోల్లో ప్రయాణించారు. 
  • ఆటోల్లో సభా ప్రాంగణానికి చేరుకోగానే ప్రయాణానికి సంబంధించిన డబ్బులను ఆటో డ్రైవర్లకు చంద్రబాబు, ఇతర నేతలు అందచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ, రవాణ శాఖ ఉన్నతాధికారులు సహా స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

ఆటోడ్రైవర్ల కోసం ప్రత్యేక యాప్

* రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల ప్రయోజనాల కోసం ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వమే ఒక ప్రత్యేక యాప్‍ను తీసుకువస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
* ఈ యాప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని డ్రైవర్ల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు.
* ఆటో డ్రైవర్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు ప్రత్యేకంగా 'ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు'ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
* 'ఆటో డ్రైవర్ సేవలో...' పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో రూ.436 కోట్లను జమ చేశారు.
* ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి డ్రైవర్‌కు రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు.
* గత ప్రభుత్వ హయాంలో ఆటోలపై పెంచిన జరిమానాల భారాన్ని తగ్గిస్తామని, అనవసర జీవోలను రద్దు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
* కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 23 వేల కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు చేసి గుంతలు లేని రోడ్లుగా మార్చామని, దీనివల్ల వాహనాల రిపేర్ల ఖర్చు తగ్గిందని తెలిపారు.
* తాను పరదాలు కట్టుకుని రాలేదని, ప్రజల మధ్య నుంచి దర్జాగా ఆటోలో వచ్చానని గత పాలకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
 
Chandrababu Naidu
Auto Drivers Andhra Pradesh
Pawan Kalyan
Nara Lokesh
Auto Drivers Welfare Scheme
Vijayawada
AP BJP Madhav
Auto App Andhra Pradesh
AP Auto Fares
Andhra Pradesh Roads

More Telugu News