Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. పొన్నం ప్రభాకర్‌పై సొంత పార్టీ నేత అంజన్ కుమార్ ఆగ్రహం

Ponnam Prabhakar Faces Ire of Anjan Kumar Yadav Over Jubilee Hills Bypoll
  • పార్టీలో పొన్నం ప్రభాకర్ కంటే తాను సీనియర్ నాయకుడినన్న అంజన్ కుమార్ యాదవ్
  • జూబ్లీహిల్స్ టిక్కెట్ ఎవరికి అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని వ్యాఖ్య
  • కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబం నుండి ఒకరికి మించి ప్రజాప్రతినిధులుగా ఉన్నారని వ్యాఖ్య
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై సొంత పార్టీ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో టిక్కెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విభేదాలు వెలుగుచూస్తున్నాయి. జూబ్లీహిల్స్ టిక్కెట్ కోసం అంజన్ కుమార్ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్థానికులకు అవకాశం ఉంటుందని, బయటి నుంచి దిగుమతి ఉండదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై అంజన్ కుమార్ యాదవ్ స్పందించారు. పార్టీలో పొన్నం ప్రభాకర్ కంటే తాను సీనియర్ నాయకుడినని చెప్పారు. జూబ్లీహిల్స్ టిక్కెట్ ఎవరికి అనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని, పొన్నం ప్రభాకర్ కాదని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబం నుంచి ఒకరికి మించి ప్రజాప్రతినిధులుగా ఉన్నారని కూడా ఆయన గుర్తు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి, కోమటిరెడ్డి సోదరులు, మల్లు భట్టివిక్రమార్క, ఆయన అన్న మల్లు రవి, వివేక్ కుటుంబంలో ఆయన మంత్రిగా ఉంటే కొడుకు ఎంపీగా, సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తు చేశారు. తన కుమారుడు ఎంపీగా ఉన్నంత మాత్రాన తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలని మహమూద్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిని, హోంమంత్రిని చేశారని గుర్తు చేశారు. నాయిని నర్సింహారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి హోంమంత్రిని చేశారని అంజన్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు.
Ponnam Prabhakar
Jubilee Hills Bypoll
Anjan Kumar Yadav
Telangana Congress
Hyderabad Politics

More Telugu News