India vs West Indies: విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. రెండున్నర రోజుల్లోనే టెస్ట్ ఖతం

India defeat West Indies by an innings and 140 runs in First Test
  • ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచిన శుభ్‌మన్ గిల్ సేన
  • మూడు రోజే ముగిసిన అహ్మదాబాద్ టెస్ట్
  • భారత్ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జడేజాల సెంచరీలు
  • రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 7 వికెట్లు పడగొట్టిన మహమ్మద్ సిరాజ్
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘ‌న విజ‌యం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను రెండున్నర రోజుల్లోనే ముగించి, ఇన్నింగ్స్ 140 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన శుభ్‌మన్ గిల్ సేన.. కరేబియన్ జట్టును ఏ దశలోనూ కోలుకోనీయలేదు.

భారత్ ఆల్ రౌండ్ షో..  
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బౌలింగ్ చేసిన భారత్, అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా, పరుగుల వరద పారించింది. కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా అద్భుత సెంచరీలతో కదం తొక్కగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో భారత్ 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లోనే 286 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది.

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ బ్యాటర్ల కథ మళ్లీ మొదటికే వచ్చింది. భారత బౌలర్ల పదునైన బంతులకు సమాధానం చెప్పలేక చేతులెత్తేశారు. వరుసగా వికెట్లు కోల్పోయి కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. 

విండీస్ ను రెండో ఇన్నింగ్స్ లో చుట్టేయడంలో స్పిన్నర్ రవీంద్ర జడేజా, పేసర్ మహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించారు. సిరాజ్ 31 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, జడేజా 54 పరుగులకు 4 వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 7 వికెట్లు పడగొట్టిన సిరాజ్, తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు.

ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో, చివరి టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 10 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.


India vs West Indies
Shubman Gill
India cricket
West Indies cricket
Test match
cricket series
K L Rahul
Ravindra Jadeja
Mohammed Siraj

More Telugu News