Kapil Raghu: అమెరికాలో పర్ఫ్యూమ్ కారణంగా భారతీయుడికి నెల రోజుల నరకం.. అసలేం జరిగింది?

Indian man Kapil Raghu detained in US over opium perfume
  • 'ఓపియం' పేరున్న పర్ఫ్యూమ్‌ను డ్రగ్స్‌గా పొరబడిన పోలీసులు
  • ల్యాబ్ టెస్టులో పర్ఫ్యూమ్ అని తేలినా వీడని కష్టాలు
  • దాదాపు నెల రోజుల పాటు ఇమ్మిగ్రేషన్ అధికారుల నిర్బంధం
  • చివరకు కోర్టులో ఆరోపణల కొట్టివేత, రద్దయిన వర్క్ వీసా
అమెరికాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కారులో 'ఓపియం' అనే పేరున్న పర్ఫ్యూమ్ బాటిల్ ఉండటంతో, దాన్ని పోలీసులు నిజమైన మాదకద్రవ్యంగా భావించి ఓ భారత జాతీయుడిని అరెస్ట్ చేశారు. ఈ చిన్న పొరపాటు కారణంగా అతడు దాదాపు నెల రోజుల పాటు నిర్బంధంలో ఉండాల్సి వచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అమెరికా పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్న కపిల్ రఘు అనే భారత వ్యక్తిని మే 3న ఆర్కాన్సాస్‌లోని బెంటన్ నగరంలో పోలీసులు ఒక సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘన కింద ఆపారు. కారును తనిఖీ చేస్తున్న సమయంలో వారికి 'ఓపియం' అని రాసి ఉన్న ఓ చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ కనిపించింది. అది కేవలం బ్రాండెడ్ సువాసన ద్రవ్యం అని రఘు ఎంత చెప్పినా వినకుండా, దాన్ని నిషేధిత డ్రగ్ అయిన ఓపియం (నల్లమందు)గా భావించి వెంటనే అతడిని అరెస్ట్ చేశారు.

అనంతరం, ఆర్కాన్సాస్ స్టేట్ క్రైమ్ ల్యాబ్ ఆ బాటిల్‌లోని ద్రవాన్ని పరీక్షించి, అది పర్ఫ్యూమ్ మాత్రమేనని, అందులో ఎలాంటి మాదకద్రవ్యాలు లేవని నిర్ధారించింది. అయినప్పటికీ, రఘును వెంటనే విడుదల చేయలేదు. అతడి వీసా గడువు ముగిసిందంటూ ఓ సాంకేతిక లోపాన్ని అధికారులు గుర్తించారని అతడి తరఫు న్యాయవాది మైక్ లాక్స్ తెలిపారు. దీంతో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐస్) అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని, లూసియానాలోని ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి తరలించారు. అక్కడ మరో 30 రోజులు నిర్బంధంలో ఉంచారు.

ఈ ఘటనతో తన కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురైందని రఘు ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య ప్రతిరోజూ ఫోన్‌లో ఏడ్చేదని, తన కుమార్తె కూడా తీవ్రంగా కుంగిపోయిందని ఓ స్థానిక మీడియాకు తెలిపారు. మే 20న కోర్టు రఘుపై ఉన్న ఆరోపణలను కొట్టివేసినప్పటికీ, ఈ నిర్బంధం కారణంగా అతని వర్క్ వీసా రద్దయిందని, పౌరసత్వ ప్రక్రియకు ఆటంకం కలిగిందని అతని భార్య యాష్లీ మేస్ వాపోయారు. న్యాయపరమైన ఖర్చుల కోసం ఆమె ఆన్‌లైన్‌లో విరాళాలు సేకరిస్తున్నారు. 
Kapil Raghu
Arkansas
perfume arrest
opium perfume
false arrest
Indian American
immigration detention
work visa
citizenship application
Bentonsville

More Telugu News