PM Modi: గాజా శాంతి యత్నాల్లో పురోగతి.. ట్రంప్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీ

PM Modi Praises Trump As Hamas Agrees To Release Hostages
  • ట్రంప్ శాంతి ప్రణాళికలోని కొన్ని ష‌ర‌తులకు హమాస్ అంగీకారం
  • బందీల విడుదల కీలక ముందడుగు అని భారత్ వెల్లడి
  • శాశ్వత శాంతికి భారత్ మద్దతు కొనసాగుతుందని స్పష్టీకరణ
  • యుద్ధ విరమణ, ఇజ్రాయెల్ సేనల ఉపసంహరణకు హమాస్ ఓకే
గాజాలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రశంసించారు. గాజాలో శాంతి స్థాపన దిశగా కీలక పురోగతి కనిపిస్తోందని, ఇందుకు ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలోని కొన్ని కీలక ష‌ర‌తులకు పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్ అంగీకారం తెలిపింది. ఈ పరిణామం జరిగిన కొన్ని గంటలకే ప్రధాని మోదీ స్పందించారు. ట్రంప్ ఇచ్చిన గడువుకు ముందే హమాస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఈ విషయంపై ప్రధాని మోదీ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదికగా ఒక పోస్ట్ చేశారు. "గాజాలో శాంతి ప్రయత్నాలు కీలక పురోగతి సాధిస్తున్న తరుణంలో అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన్ని మేము స్వాగతిస్తున్నాము. బందీల విడుదల దిశగా వస్తున్న సంకేతాలు ఒక ముఖ్యమైన ముందడుగు. శాశ్వతమైన శాంతి కోసం జరిగే అన్ని ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇస్తుంది" అని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

అంతకుముందు, ట్రంప్ తన శాంతి ప్రణాళికను ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు (అమెరికా కాలమానం ప్రకారం) అంగీకరించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హమాస్‌కు అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే యుద్ధాన్ని ముగించడం, గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ, ఇజ్రాయెల్ బందీలు, పాలస్తీనా ఖైదీల విడుదల, సహాయ పునరుద్ధరణ కార్యక్రమాలు వంటి అంశాలకు హమాస్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. పాలస్తీనియన్లను వారి భూభాగం నుంచి తరిమివేయడాన్ని వ్యతిరేకించే అంశానికి కూడా హమాస్ సానుకూలంగా స్పందించింది.
PM Modi
Narendra Modi
Gaza
Donald Trump
Israel
Palestine
Hamas
Gaza peace talks
India
Israel Palestine conflict
peace plan

More Telugu News