Tesla Model Y: హైదరాబాద్ రోడ్లపైకి తొలి టెస్లా కారు.. కానీ పన్నుల మోతతో యజమానికి షాక్!

Praveen Koduru First Tesla Car on Hyderabad Roads Tax Shock
  • కొంపల్లికి చెందిన డాక్టర్ ప్రవీణ్ కోడూరు కొనుగోలు
  • ముంబై నుంచి 770 కిలోమీటర్లు నడుపుకుంటూ రాక
  • దేశంలో ఇది ఆరవ టెస్లా కారు
  • ఇతర రాష్ట్రంలో కొన్నారని 22 శాతం పన్ను విధింపు
  • తెలంగాణ పన్నుల విధానంపై యజమాని తీవ్ర అసంతృప్తి
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన టెస్లా ఎలక్ట్రిక్ కారు తొలిసారిగా హైదరాబాద్ రోడ్లపైకి అడుగుపెట్టింది. నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు ఈ కారును కొనుగోలు చేయగా, ఆయన సంతోషాన్ని తెలంగాణ ప్రభుత్వ పన్నుల విధానం ఆవిరి చేసింది. ఇతర రాష్ట్రంలో కొనుగోలు చేశారన్న కారణంతో భారీగా పన్ను విధించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే... కొంపల్లిలోని శ్రీనందక అడ్వాన్స్‌డ్‌ సర్జరీ సెంటర్‌లో అడ్వాన్స్‌డ్‌ ల్యాప్రోస్కోపిక్‌, లేజర్‌ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ప్రవీణ్‌ కోడూరు ఈ టెస్లా ‘మోడల్ వై’ కారును కొనుగోలు చేశారు. దేశంలో నమోదైన ఆరవ టెస్లా కారు ఇదే కావడం విశేషం. ముంబైలో టెస్లా షోరూమ్‌ ప్రారంభమయ్యాక కారును బుక్ చేసుకున్నానని, గత నెల 27న మధ్యాహ్నం 3 గంటలకు అక్కడే డెలివరీ తీసుకున్నానని ఆయన తెలిపారు.

ముంబై నుంచి సుమారు 770 కిలోమీటర్లు తానే స్వయంగా కారు నడుపుకుంటూ హైదరాబాద్ చేరుకున్నట్లు ప్రవీణ్‌ కోడూరు వివరించారు. ప్రయాణ మధ్యలో పుణె, షోలాపూర్‌లలో ఒక్కోసారి చార్జింగ్ చేశామని చెప్పారు. అయితే, తెలంగాణకు వచ్చాక వాహన పన్నుల వివరాలు తెలిసి తాను షాక్‌కు గురయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 పన్నుల మోతతో యజమానికి షాక్!
వాస్తవానికి ఈ కారు ధర రూ. 63 లక్షలు కావాల్సి ఉండగా, పన్నుల కారణంగా ఖర్చు అమాంతం పెరిగిందని ఆయన అన్నారు. "తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను మినహాయింపు ఉంది. కానీ, వాహనాన్ని ఇతర రాష్ట్రంలో కొనుగోలు చేశామన్న కారణంతో ఏకంగా 22 శాతం పన్ను వసూలు చేశారు. ఇది చాలా నిరాశ కలిగించింది" అని ప్రవీణ్‌ కోడూరు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మరో కంపెనీ కూడా టెస్లా కారు బుక్ చేసుకున్నప్పటికీ, తానే మొదట డెలివరీ తీసుకున్న వ్యక్తినని ఆయన పేర్కొన్నారు.
Tesla Model Y
Praveen Koduru
Hyderabad
Electric Vehicle Tax
Telangana
Car Purchase
Mumbai
EV Policy
Shreenandaka Advanced Surgery Center
Tesla India

More Telugu News