పాకిస్థానే కాల్పుల విరమణ కోరింది.. ట్రంప్ గొప్పలు చెప్పొద్దు: ఐఏఎఫ్ చీఫ్ ఏపీ సింగ్

  • ఆపరేషన్ సిందూర్‌లో పాక్ యుద్ధ విమానాలు కూల్చివేశాామ‌న్న ఏపీ సింగ్ 
  • కాల్పుల విరమణ కోసం పాకిస్థానే తమను అభ్యర్థించిందని స్ప‌ష్టీక‌రణ‌
  • డొనాల్డ్ ట్రంప్ వాదనలను తోసిపుచ్చిన ఎయిర్ చీఫ్ 
  • పీఓకేలో 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామ‌ని వెల్ల‌డి
  • భారత్ విమానాలు కూలాయన్నది పాక్ ఆర్మీ దుష్ప్రచారమ‌న్న ఏపీ సింగ్‌
ఆపరేషన్ సిందూర్ అనంతరం కాల్పుల విరమణ కోసం పాకిస్థానే భారత్‌ను అభ్యర్థించిందని, ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఏమాత్రం లేదని భారత వాయుసేన చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ శుక్రవారం స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన అమెరికా తయారీ ఎఫ్-16, చైనా తయారీ జె-17 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఆయన సంచలన విషయాలు వెల్లడించారు.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగానే ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టామని ఏపీ సింగ్ తెలిపారు. ఈ చర్యలో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేశామని అన్నారు. భారత సైనిక శక్తిని, కచ్చితత్వాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ఆపరేషన్‌లో భారత విమానాలు ధ్వంసమయ్యాయంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అది కేవలం పాకిస్థాన్ పౌరులను తప్పుదోవ పట్టించేందుకు పాక్ సైన్యం చేస్తున్న దుష్ప్రచారం అని కొట్టిపారేశారు. “మేం 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించాం. ఆ తర్వాత వారే (పాకిస్థాన్) కాల్పుల విరమణ కోసం అడిగారు” అని ఏపీ సింగ్ వివరించారు. దాదాపు 100 గంటల పాటు సాగిన ఈ ఘర్షణలో పాక్ క్షిపణులు, డ్రోన్లను మన గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా తిప్పికొట్టాయని ప్రశంసించారు.

భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఘనత తనదేనని, వాణిజ్యపరమైన ఒత్తిళ్లతో తానే దీనిని సాధించానని ట్రంప్ పదేపదే చెబుతున్న నేపథ్యంలో వాయుసేన చీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే సమయంలో, భవిష్యత్ యుద్ధాల స్వరూపంపై కూడా ఆయన హెచ్చరించారు. “తదుపరి యుద్ధం గతంలో జరిగిన వాటికి భిన్నంగా ఉంటుంది. మనం ఇప్పటి నుంచే భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండాలి” అని అన్నారు. గత నెలలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సైబర్ వార్‌ఫేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు భవిష్యత్ యుద్ధాలను నిర్దేశిస్తాయని చెప్పిన విషయం తెలిసిందే.


More Telugu News