Sana Mir: ఆజాద్ కశ్మీర్ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గని పాక్ మాజీ కెప్టెన్.. క్షమాపణ చెప్పేది లేదన్న సనా మిర్

Sana Mir Refuses To Apologise On Azad Kashmir Row
  • మహిళల ప్రపంచకప్ కామెంట్రీలో పాక్ మాజీ కెప్టెన్ సనా మీర్ వ్యాఖ్యలు
  • పాక్ క్రికెటర్ నటాలియాను 'ఆజాద్ కశ్మీర్' వాసిగా పేర్కొన్న వైనం
  • సనా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు
  • వివాదంపై స్పందించి, వివరణ ఇచ్చిన సనా మీర్
  • తన వ్యాఖ్యలను రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి
  • ఆటగాళ్ల స్ఫూర్తిని చెప్పడమే తన ఉద్దేశమని స్పష్టీకరణ
పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి, వ్యాఖ్యాత సనా మీర్ తన 'ఆజాద్ కశ్మీర్' వ్యాఖ్యలపై వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయంలో తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ తన వ్యాఖ్యలను సమర్థించుకుంది. క్రీడాకారిణి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని చెప్పడమే తన ఉద్దేశమని, అనవసరంగా దీన్ని రాజకీయం చేయవద్దని హితవు పలికింది.
 
మహిళల ప్రపంచకప్ 2025 క్వాలిఫయర్స్‌లో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు సనా మీర్ కామెంటేటర్‌గా వ్యవహరించింది. ఈ సందర్భంగా పాక్ క్రీడాకారిణి నటాలియా పర్వేజ్ గురించి మాట్లాడుతూ.. "నటాలియా పర్వేజ్ కశ్మీర్ నుంచి వచ్చింది... ఆజాద్ కశ్మీర్ నుంచి" అని వ్యాఖ్యానించింది. క్రికెట్ కెరీర్ కోసం ఆమె లాహోర్‌లో ఎక్కువగా శిక్షణ తీసుకుంటుందని చెప్పింది. అయితే, లైవ్ మ్యాచ్‌లో 'ఆజాద్ కశ్మీర్' (పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్థాన్ పిలుచుకునే పేరు) అనడంపై భారత అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ వ్యాఖ్య అని, క్రీడా వేదికపై ఇలాంటివి తగవని సోషల్ మీడియా వేదికగా ఆమెను ఏకిపారేశారు.

 వెనక్కి తగ్గకుండా వివరణ
విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో సనా మీర్ ఎక్స్ వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చింది. "నా వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేయడం బాధాకరం. ఓ క్రీడాకారిణి నేపథ్యం, ఆమె ఎదుర్కొన్న సవాళ్లను ప్రపంచానికి తెలియజేయాలనే సదుద్దేశంతోనే నేను మాట్లాడాను. ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ప్రస్తావించాను తప్ప, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. దయచేసి క్రీడల్లోకి రాజకీయాలను లాగొద్దు" అని ఆమె ఘాటుగా స్పందించారు.

"వ్యాఖ్యాతలుగా క్రీడాకారుల కథలను చెప్పడం మా బాధ్యత. అదే రోజు మరో ఇద్దరు పాక్ క్రీడాకారిణుల నేపథ్యం గురించి కూడా మాట్లాడాను. నేను పరిశోధన చేసినప్పుడు నటాలియా ప్రొఫైల్‌లో ఆమెది 'ఆజాద్ కశ్మీర్' అనే ఉంది. అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఇక్కడ జత చేస్తున్నాను. వివాదం తలెత్తిన తర్వాత ఇప్పుడు ఆ ప్రొఫైల్‌ను మార్చడం గమనార్హం. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే, అది నా ఉద్దేశం కాదు" అని స్పష్టం చేసింది. అయితే, ఆమె వివరణ ఇచ్చినప్పటికీ, క్షమాపణ మాత్రం చెప్పలేదు. ఈ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇంతవరకు స్పందించలేదు.
Sana Mir
Pakistan
Azad Kashmir

More Telugu News