Sajeeb Wazed: బంగ్లాదేశ్ లో హిందువులు భయం భయంగా దుర్గా పూజ జరుపుకుంటున్నారు: షేక్ హసీనా తనయుడు

Bangladesh Hindus celebrate Durga Puja Amid Fear says Sajeeb Wazed
  • బంగ్లాదేశ్‌లో భయంతో దుర్గా పూజ జరుపుకుంటున్న హిందూ మైనార్టీలు
  • యూనస్ మధ్యంతర ప్రభుత్వం వల్లే పెరిగిన మతతత్వం
  • దేవాలయాలపై దాడులు, కుటుంబాలకు బెదిరింపులు ఎక్కువయ్యాయి
  • తీవ్రవాదులకు యూనస్ సర్కారు అండగా నిలుస్తోందన్న ఆరోపణ
  • మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ తీవ్ర విమర్శలు
  • తిరిగి అధికారంలోకి వచ్చి మైనార్టీలను కాపాడుకుంటామని భరోసా
బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలు భయం, అనిశ్చితి వాతావరణంలో దుర్గా పూజ ఉత్సవాలు జరుపుకుంటున్నారని మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ ఆరోపించారు. దేశంలో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మతతత్వం మళ్లీ పెరిగిపోయిందని, మతపరమైన హింసకు ఆజ్యం పోస్తున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా సజీబ్ వాజెద్ మాట్లాడుతూ, "దుర్గా పూజ అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. కానీ ఈ ఏడాది బంగ్లాదేశ్‌లోని మా హిందూ సోదరులు భయం నీడన పండుగ చేసుకుంటున్నారు. యూనస్ పాలనలో మతతత్వ శక్తులు మళ్లీ బలపడి, మతపరమైన దాడులకు తెగబడుతున్నాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, హిందూ కుటుంబాలను బెదిరిస్తున్నారని, స్వేచ్ఛగా పూజలు చేసుకునే హక్కుకు భంగం కలుగుతోందని ఆయన అన్నారు.

1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధాన్ని వ్యతిరేకించిన తీవ్రవాద శక్తులే ఇప్పుడు మళ్లీ పేట్రేగిపోతున్నాయని, దేశ స్ఫూర్తిని కాపాడేవారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని వాజెద్ పేర్కొన్నారు. తమ అవామీ లీగ్ పార్టీ ఎల్లప్పుడూ మైనార్టీలకు రక్షణగా నిలిచిందని గుర్తుచేశారు. "1971లో ధ్వంసమైన ఆలయాలను పునర్నిర్మించాం. హిందువులు, బౌద్ధులు, క్రైస్తవుల హక్కులను కాపాడాం. మత సామరస్యం, సమానత్వం మా రాజకీయ విధానాల్లో ప్రధానమైనవి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఐక్యత పునాదులపై ఏర్పడింది, విభజనపై కాదు" అని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం హిందూ సోదరులు భయంతో దీపాలు వెలిగించి దుర్గా మాతకు ప్రార్థనలు చేస్తున్నారని, ఈ చీకటి ఎక్కువ కాలం ఉండదని ఆయన అన్నారు. అవామీ లీగ్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు ప్రతి హిందువు, ప్రతి మైనార్టీ ఎలాంటి భయం లేకుండా తమ పండుగలను పూర్తి స్వేచ్ఛ, గౌరవంతో జరుపుకుంటారని సజీబ్ వాజెద్ భరోసా ఇచ్చారు.
Sajeeb Wazed
Bangladesh
Durga Puja
Hindus
minorities
Sheikh Hasina
Muhammad Yunus
religious violence
Awami League
religious harmony

More Telugu News